New Born Babies Deaths In Maharashtra :ఒక్క రోజు వ్యవధిలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో 12 మంది నవజాత శిశువులు సహా 24 మంది మరణించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్‌లో ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో జరిగింది. వైద్యులు, మందుల కొరత వల్లే వీరంతా మరణించినట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 24 మంది మృతిచెందగా.. వీరిలో 12 మంది రోగులు పలు వ్యాధులు, పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి డీన్ శ్యామ్‌రావ్ వాకోడె వెల్లడించారు. ఆస్పత్రిలో పలువురు సిబ్బందిని బదిలీ చేయడం వల్ల రోగులకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వివరించారు. సరిపోయేంత బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం వల్ల మందులు కొనుగోలు చేయలేకపోతున్నట్లు తెలిపారు. నాందేడ్ పరిసర ప్రాంతాల్లో ఇదే అతిపెద్ద ఆస్పత్రి అని.. దీంతో రోగులు ఎక్కువగా రావడం వల్ల సౌకర్యాలు సరిపోవడం లేదని చెప్పారు. ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా రోగులు వస్తారన్నారు.
ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మహైశేఖర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించేందుకు తాను ప్రత్యేకంగా వెళుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఫైర్
మరోవైపు ఈ అంశంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మూడు ఇంజిన్ల (బీజేపీ, ఏక్‌నాథ్ శిందే- శివసేన, ఎన్సీపీ- అజిత్ వర్గం) ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేత అశోక్ చవాన్.. ప్రభుత్వం వెంటనే రోగులకు సరైన వైద్య సదుపాయం అందించాలని డిమాండ్ చేశారు. మరో 70 మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆస్పత్రిలో 500 బెడ్లు ఉంటే ప్రస్తుతం 1200 మంది రోగులు ఉన్నారని ఆరోపించారు.