తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుదుచ్చేరిలో విజయఢంకా మోగించిన ఎన్​డీఏ - పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల లైవ్​ అప్​డేట్స్​

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ విజయంవైపు దూసుకెళ్లింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్​ను అందుకుంది. 16 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రజల మనసు దోచుకునేందుకు కూటమి చేసిన కృషి ఫలించింది. ముఖ్యంగా రంగస్వామి ఎఫెక్ట్​ కలిసివచ్చింది. అటు ప్రధాని మోదీ ప్రచారాలు సత్ఫలితాలను ఇచ్చాయి. కాంగ్రెస్​పై వ్యతిరేకతను ఉపయోగించుకుని కూటమి నేతలు ప్రజల్లోకి వెళ్లిన తీరు విజయాన్ని దగ్గర చేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

nda in puduchheri
పుదుచ్చేరిలో ఎన్​డీఏ విజయం సాధించిందిలా...

By

Published : May 2, 2021, 11:30 PM IST

ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలను నిజం చేస్తూ.. పుదుచ్చేరి ఎన్నికల్లో ఎన్​డీఏ విజయం సాధించింది. అన్నాడీఎంకే, రంగస్వామి కాంగ్రెస్‌ పార్టీతో కూటమిగా ఏర్పడిన భాజపా.. అధికారాన్ని దక్కించుకుంది. 30(నామినేటెడ్ స్థానాలు మినహా) అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో మ్యాజిక్​ ఫిగర్​ అయిన 16 స్థానాలను ఎన్​డీఏ కైవసం చేసుకుంది. ఫలితంగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. కాంగ్రెస్ కూటమి 8 స్థానాల్లో గెలుపొందగా.. ఇతరులు 6 స్థానాలను కైవసం చేసుకున్నారు.

అయితే ఈ విజయం కోసం ఎన్​డీఏ తీవ్రస్థాయిలో కృషి చేసింది. పక్కా ప్రణాళికలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో ముందుకు సాగి ప్రజల మన్ననలు అందుకుంది. కాంగ్రెస్​ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఎన్​డీఏకు కలిసివచ్చింది.

రంగస్వామి ఎఫెక్ట్​..

కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి.. ఆల్‌ ఇండియా నమదు రాజ్యం కాంగ్రెస్‌ (ఏఐఎన్‌ఆర్‌సీ-ఎన్​ఆర్​ కాంగ్రెస్‌)ను స్థాపించారు. అన్నాడీఎంకేతో కలిసి ఎన్​ఆర్​ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన భాజపా.. వ్యూహాత్మకంగా వ్యవహరించి గెలుపును దక్కించుకుంది.

ఎన్​డీఏ విక్టరీ సీక్రెట్​

ఎన్​ఆర్​ కాంగ్రెస్‌ 16, భాజపా 9, అన్నాడీఎంకే 5 స్థానాల నుంచి అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. ఇలా రంగస్వామితో బలమైన మైత్రి ఏర్పరచుకుని కూటమిగా ముందుకు సాగింది కమలదళం.

ఇదీ చూడండి:ఎగ్జిట్​పోల్స్​: పుదుచ్చేరిలో అధికారం ఎన్​డీఏదే!

కాంగ్రెస్​ కూడా...

ఈ దఫా ఎన్నికల్లో ఎన్​డీఏ గెలుపొందడంలో కాంగ్రెస్​ కూడా ఒకింత పాత్ర పోషించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి.. అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అదే సమయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవడంలోనూ కమలదళం సఫలమైంది.

అటు బలమైన నేతలు కాంగ్రెస్​కు ఒక్కొక్కరుగా దూరమవడం.. ఆ పార్టీని దెబ్బ కొట్టింది. యానాంలో అసలు అభ్యర్థే లేకపోవడం అనేకమందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మోదీ ప్రత్యేక శ్రద్ధ...

సాధారణ పరిస్థితుల్లో.. పుదుచ్చేరి ఎన్నికలు కన్పించకుండానే ముగిసిపోతాయి. కానీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ ప్రభుత్వం కుప్పకూలడం, అనంతరం కేంద్ర పాలిత ప్రాంతంపై పట్టు సాధించడం కోసం భాజపా చేసిన ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

పుదుచ్చేరిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రచారాలు నిర్వహించారు. ఇది అక్కడి ఎన్​డీఏకు కలిసి వచ్చిన అంశం. మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామిపై, కాంగ్రెస్​పై మోదీ గుప్పించిన విమర్శలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మోదీ మ్యాజిక్​తో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి కూటమి నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. ఓటర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టోను రూపొందించి.. వారి ఓట్లు దక్కించుకున్నారు.

ఇదీ చూడండి:పుదుచ్చేరిలో 78.13శాతం పోలింగ్

ABOUT THE AUTHOR

...view details