NDA Meeting In Delhi : భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశలో.. NDA కూటమి కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. NDAను ఓడించేందుకు విపక్షాలు ఏకమైన వేళ.. దిల్లీలో భాజపా బల ప్రదర్శన నిర్వహించింది. పాత మిత్రులకు ఆహ్వానం పలికేందుకు భాజపా నేతృత్వంలో ఏర్పాటు చేసిన NDA భేటీకి 38 పార్టీల నేతలుహాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం N రంగస్వామి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి హాజరయ్యారు. ఈ భేటీలో ఎన్డీఏ నేతలు మోదీని సత్కరించగా, సమావేశం అపారమైన సంతోషాన్ని ఇస్తోందని.. ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ ఏర్పాటు కాలేదన్న ప్రధాని.. దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకే వచ్చిందని వివరించారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే.. దేశ ప్రగతి మార్చగలదని పేర్కొన్నారు. స్థిర ప్రభుత్వం వల్లే.. ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వివరించారు. వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ మారుతోందని అశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ 50 శాతం సంపాదింస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
"ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది. ఈ 25 ఏళ్లలో దేశ ప్రగతికి మార్గం చూపడం, క్షేత్రస్థాయి ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషిచేసింది. రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి అనే నినాదంతో ఎన్డీయే నిరంతరం పనిచేసింది. వచ్చే 25 ఏళ్లలో భారత్ భారీ లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకుసాగుతోంది. అభివృద్ధి చెందిన భారతదేశం, ఆత్మనిర్భర్ భారత్‌యే ఈ లక్ష్యం. కోట్లాది మంది భారతీయులు ప్రస్తుతం నూతన సంకల్పంతో, నవోత్సాహంతో నిండి ఉన్నారు. ఈ మహత్తర కాలంలో ఎన్డీయే పాత్ర చాలా కీలకం. ఒకవైపు నూతనోత్సాహంతో నిండి ఉన్న మూడు శక్తులు ఉన్నాయి. అందులో ఎన్ ద్వారా నవ భారతం కోసం, డీ ద్వారా అభివృద్ధి చెందిన దేశం కోసం, ఏ ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం. దేశంలో పేద, మధ్యతరగతి, యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులు సహా అందరి విశ్వాసం ఎన్డీయేపై ఉంది."