తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమలంతో మిత్రభేదం.. ఎన్డీయేను వీడుతున్న కీలక పార్టీలు - JDU BJP ALLIANCE

NDA alliance party list 2022: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి భాగస్వామ్య పక్షాలతో అంతగా పొసగడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే శివసేన, అకాలీదళ్ పార్టీలు ఎన్డీఏకు దూరం కాగా.. తాజాగా జేడీ(యు) సైతం గుడ్​బై చెప్పడం ఇందుకు నిదర్శమని వివరిస్తున్నారు.

nda alliance party list 2022
nda alliance party list 2022

By

Published : Aug 10, 2022, 6:40 AM IST

NDA alliance parties: భాజపాతో స్నేహబంధాన్ని జేడీ(యు) తెంచుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయేలో పరిస్థితులు సవ్యంగా లేవని.. ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కమలదళంతో ఇతర భాగస్వామ్య పక్షాలకు అంతగా పొసగడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక.. మూడేళ్లలో మూడు ప్రధాన మిత్రపక్షాలు (శివసేన, అకాలీదళ్‌, జేడీ(యు) కాషాయ పార్టీతో దోస్తీకి రాంరాం చెప్పడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.

జేడీ(యు) నేత జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్‌గా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరు తెరమీదకు రావడంతో భాజపాతో సంబంధాలను 2013లో జేడీ(యు) తెంచుకుంది. 2017లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి నుంచి బయటికొచ్చిన ఆ పార్టీ.. తిరిగి కమలదళంతో చేతులు కలిపింది. తాజాగా మళ్లీ కమలనాథులతో మైత్రికి స్వస్తి చెప్పింది. అంతకంటే ముందు- 2019లో కేంద్రంలో పాలనాపగ్గాలు చేపట్టిన 18 నెలల వ్యవధిలోనే భాజపాకు రెండు గట్టి దెబ్బలు తగిలాయి. సీఎం పదవిపై తకరారుతో శివసేన, సాగుచట్టాల విషయంలో విభేదించి అకాలీదళ్‌.. ఎన్డీయేను వీడాయి.

2014-19 మధ్యకాలంలోనూ ఎన్డీయేకు తెలుగుదేశం పార్టీ, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) వంటి కీలక మిత్రపక్షాలు దూరమయ్యాయి. ఇవి కాకుండా ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌తంత్రిక్‌ పార్టీ, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌, గోర్ఖా జనముక్తీ మోర్చా, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, ఎండీఎంకే, డీఎండీకే వంటి పలు ఉప ప్రాంతీయ పార్టీలు కూడా 2014 తర్వాత వివిధ దశల్లో భాజపాతో చెలిమిని వదులుకున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే కేవలం కాగితాలకే పరిమితమైందని అకాలీదళ్‌ నేత నరేశ్‌ గుజ్రాల్‌ తాజాగా ఎద్దేవా చేశారు. భాజపా ఒంటెద్దు పోకడలే అందుకు కారణమని విమర్శించారు. ఇప్పటికీ కూటమిలో ఉన్న భాజపాయేతర పార్టీలు కూడా తమ మనుగడను కాపాడుకోవడం కోసం త్వరలోనే బయటకు రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details