మహిళకు (Model hair cutting) తప్పుడు క్షవరం (హెయిర్‌కట్) సహా ఆమె కేశాలకు వేరే చికిత్స చేసినందుకు రూ.2 కోట్లు పరిహారంగా చెల్లించాలంటూ దిల్లీలోని విలాసవంతమైన హోటల్‌కు (NCDRC Haircut) జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశాలు జారీచేసింది. మోడలింగ్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలన్న ఆమె కల హోటల్ సిబ్బంది పొరపాటు కారణంగా సర్వనాశనం అయిందని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ఎన్‌సీడీఆర్‌సీ అధ్యక్షుడు ఆర్.కె అగర్వాల్, సభ్యుడు ఎస్‌ఎం కాంతికార్ ఆదేశాలు జారీచేశారు. మహిళలకు కేశ సంపదతో (Model hair cutting) భావోద్వేగపరమైన అనుబంధం ఉంటుందని, వాటిని సంరక్షించుకునేందుకు, మంచి స్థితిలో ఉంచుకునేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవడం సహా శక్తి కొద్దీ ఖర్చు చేస్తారని వ్యాఖ్యానించారు.
కల చెదిరింది..
ఫిర్యాదుదారైన అషనా రాయ్ (Ashna Roy Haircut) తనకున్న పొడవైన కేశాల కారణంగా పలు కేశసంరక్షణ ఉత్పత్తులకు మోడల్‌గా వ్యవహరించారని, అనేక పెద్ద బ్రాండ్‌లకు పనిచేశారని కమిషన్ పేర్కొంది. "సూచనలకు విరుద్ధంగా క్షవరం (Wrong Haircut) చేయడం వల్ల ఆమె అవకాశాలు దూరమయ్యాయి. ఆమె జీవితమే మారిపోయింది. అత్యున్నత మోడల్ కావాలన్న అషనా కల నాశనమైంది." అని ఈ నెల 21న జారీ చేసిన ఉత్తర్వులో కమిషన్ స్పష్టంచేసింది.