Navratri 2023 Date and Shubh Muhurat :హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది దేవీ శరన్నవరాత్రులు అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రథమ రోజున ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ అంటే వచ్చే ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ 24వ తేదీన విజయదశమి(Dussehra) వేడుకలతో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. ఈ తొమ్మిది రాత్రులు పది రోజులలో తొమ్మిది రూపాలలోదుర్గాదేవిని (Goddess Durga) భక్తులు పూజిస్తారు. ఈ నవరాత్రులనే శరద్ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుర్గామాత ఈ సమయంలో మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఏడాది దుర్గాదేవి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఏయే రోజు అమ్మవారు ఏయే రూపంలో దర్శనమివ్వనున్నారు, పూజా విధానం మొదలైన వాటి గురించి ఇప్పుడు ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..
శరన్నవరాత్రులు 2023 ఎప్పుడు ప్రారంభం : శరన్నవరాత్రులు అశ్వినీ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నాడు రాత్రి 11:24 గంటలకు ప్రతిపాద తిథి ప్రారంభమై అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 12:24 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15 ఆదివారం నాడు ప్రారంభం కానున్నాయి.
ఈ ఏడాది నవరాత్రుల్లో కలశ స్థాపన శుభ ముహూర్తం :దేవీ నవరాత్రుల మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. ఈ కలశాన్ని శక్తి ఆరాధనలో భాగంగా తొమ్మిది రోజులు పూజిస్తారు. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు మొదటి రోజు 15 అక్టోబర్ 2023న వస్తుంది. అంటే ఆరోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శుభ సమయం.
శారదీయ నవరాత్రి 2023 క్యాలెండర్(Shardiya Navratri 2023 Calendar) :
- అక్టోబరు 15 - ఘటస్థాపన, శైలపుత్రి దేవి పూజ
- అక్టోబర్ 16 - బ్రహ్మచారిణి పూజ
- అక్టోబర్ 17 - సిందూర్ తృతీయ, చంద్రఘంట పూజ
- అక్టోబర్ 18 - కూష్మాండ పూజ, వినాయక చతుర్థి
- అక్టోబర్ 19 - స్కందమాత పూజ
- అక్టోబర్ 20 - కాత్యాయని పూజ
- అక్టోబర్ 21 - సరస్వతి పూజ, కాళరాత్రి పూజ (సప్తమి)
- అక్టోబర్ 22 - దుర్గా అష్టమి, మహాగౌరి పూజ, సంధి పూజ
- అక్టోబర్ 23 - దుర్గా మహా నవమి
- అక్టోబర్ 24 - నవరాత్రి పరణ (ఉపవాస విరమణ), దుర్గా నిమజ్జనం, విజయదశమి