తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చురేపాయ్‌.. మణిపుర్​లో శాంతి నెలకొంటుందని హామీ ఇస్తున్నా'

Narendra Modi Speech In Parliament Today : మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చురేపాయని.. మణిపుర్​లో శాంతి నెలకొంటుందని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నానని అన్నారు. మణిపుర్‌లో రెండువర్గాల మధ్య తలెత్తిన సమస్యకు తగిన పరిష్కారం కనుగొందామని ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానంలో ప్రధాని స్పష్టంచేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేసిన మోదీ.. ఆ పక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం తమకు ఎప్పుడూ దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరంగా కలిసి వస్తోందన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి 26 పార్టీలు, హస్తం పార్టీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు.

Narendra Modi Speech In Parliament Today
Narendra Modi Speech In Parliament Today

By

Published : Aug 10, 2023, 5:47 PM IST

Updated : Aug 10, 2023, 8:39 PM IST

Narendra Modi Speech In Parliament Today : లోక్‌సభలో ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానంపై.. మూడు రోజులు జరిగిన చర్చకు ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఈ సాయంత్రం ఐదింటి ప్రాంతంలో మొదలై.. దాదాపు ఏడున్నర వరకు సాగిన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశాన్ని ఏకీకృతం చేయాల్సిన బాధ్యతను ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఏనాడూ తీసుకోలేదన్న ప్రధాని.. ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజించిందని.. ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ చరిత్ర అంతా భారతమాతను చిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయిందన్న ఆయన.. ఆ పార్టీ అరాచకాలు చెప్పుకుంటే అనేకమున్నాయన్నారు. భారతమాత పట్ల ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని.. భారతమాత మరణంపై వ్యాఖ్యలు చేయడమంటే దేశ వినాశనాన్ని కోరుకున్నట్లేనని అన్నారు. వందేమాతరాన్ని.. ముక్కలు ముక్కలుగా చేసినపుడు కాంగ్రెస్‌ ఉద్దేశాలు బయటపడ్డాయన్న మోదీ.. బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు తెచ్చిపెట్టారని ధ్వమెత్తారు. ప్రస్తుత అవిశ్వాస తీర్మానంతో ప్రతిపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి సిద్ధమయిపోయాయని మోదీ అన్నారు. ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం దేవుడు తమకు ఇచ్చిన వరంగా అభివర్ణించారు.

"దేవుడు చాలా దయగలవాడు. ఏదో ఒక మాధ్యమం ద్వారా మనం కోరుకున్నవి జరిగేలా చూస్తాడు. ప్రతిపక్షం ఈ తీర్మానం తీసుకొని రావడం దేవుడి ఆశీర్వాదం అని నేను నమ్ముతున్నాను. 2018లో కూడా దేవుడి ఆశీర్వాదం వల్ల విపక్షాలు నాపైన అవిశ్వాస తీర్మానం తీసుకొని వచ్చాయి. అది మాకు బలపరీక్ష కాదు ప్రతిపక్షాలకే విశ్వాస పరీక్ష అని నేను ఆ రోజే చెప్పాను. తర్వాత మేం ఎన్నికలకు వెళ్లాం. ఆ ఎన్నికల్లో ప్రజలు సంపూర్ణంగా ఆ అవిశ్వాసాన్ని ఓడించారు. ఒక విధంగా విపక్షాల అవిశ్వాస తీర్మానం మాకు చాలా శుభం చేస్తుంది. 2024లో జరిగే ఎన్నికల్లో కూడా.. భాజపా, ఎన్డీఏ కూటమి ప్రజల ఆశీర్వాదంతో గత రికార్డులన్నీ బద్దలు కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మీరు (ప్రతిపక్షాలు) ఇప్పటికే నిర్ణయానికి వచ్చేయడాన్ని నేను చూస్తున్నాను"
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

PM Modi Speech Today :ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఘాటు విమర్శలు చేసిన ప్రధాని.. వారసత్వ రాజకీయాల సమాహారమే కొత్త సంకీర్ణంగా వచ్చిందని విమర్శించారు. ఎందరో మహానుభావులు వారసత్వ రాజకీయాలు దేశానికి నష్టదాయకమని చెప్పారని అన్నారు. జాతి నిర్మాణంలో వారసత్వ రాజకీయాలు అడ్డంకిగా మారుతాయని తొలి తరం మేధావులు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్‌ మర్చిపోయిందన్నారు. వారసత్వ రాజకీయాలు చేసేవాళ్లకు దేశంలో కాలం చెల్లిపోయిందన్న మోదీ కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మేధావులను కూడా ఆ పార్టీ ఓడించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ను ప్రశ్నించినందుకే అంబేడ్కర్‌ను రెండుసార్లు ఎన్నికల్లో ఓడించారని, ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు జగ్జీవన్‌రామ్‌ను ఓడించిందని గుర్తుచేశారు.

"తమను తాము (విపక్ష కూటమి ఇండియా) బతికించుకునేందుకు ఎన్డీఏ మద్దతు తీసుకోవాల్సినంత ఇబ్బంది పరిస్థితుల్లో వారు ఉన్నారు. కానీ గర్వమనే "ఐ" వారిని వదలడం లేదు. అందుకే వారు ఎన్డీయేలో రెండు "ఐ"లు చొప్పించారు. మొదటి ఐ అంటే 24 పార్టీల గర్వం. రెండో ఐ అంటే ఒకే కుటుంబ గర్వం. ఇండియాను కూడా ముక్కలు ముక్కలు చేశారు. I-N-D-I-A గా విడదీశారు"
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

చివర్లో అవిశ్వాస తీర్మానానికి కారణమైన మణిపుర్‌ ఘటనలపై మాట్లాడినప్రధాని..విభజన రాజకీయాలతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నిరంతరం మంటలు రేపిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్టానుసారం ప్రభుత్వాలను మార్చడం, సీఎంలను మార్చడం అనేక సమస్యలను సృష్టించిందన్నారు. మహాత్మాగాంధీ ఫొటో పెట్టలేని పరిస్థితి, జాతీయగీతం పాడలేని పరిస్థితులు మణిపుర్‌లో ఉండేవన్న మోదీ.. అప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రస్‌ ప్రభుత్వాలే ఉన్నాయని గుర్తుచేశారు. మణిపుర్‌ తీవ్రవాదానికి కారణం ఎవరో.. కారకులు ఎవరో కాంగ్రెస్‌కు గుర్తులేదా అని ప్రశ్నించారు. మణిపుర్‌లో తీవ్రవాదం పరాకాష్టకు చేరినపుడు అక్కడ అధికారంలో ఉంది ఎవరన్న ప్రధాని ప్రతి అంశాన్ని రాజకీయాల కోసమే చూడరాదన్నారు. మణిపుర్‌లో తలెత్తిన సమస్య పరిష్కారానికి అంతా కలిసి కృషి చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.

"మణిపుర్‌పై కోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత రెండువర్గాల మధ్య హింస చెలరేగింది. చాలా కుటుంబాలు ఇబ్బందిపడ్డాయి. ఎంతోమంది ఆప్తులను కోల్పోయారు. మహిళల పట్ల తీవ్రమైన అపరాధాలు జరిగాయి. దోషులకు కఠినమైన శిక్ష పడేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను. త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి. మణిపుర్‌ మరోసారి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. మణిపుర్‌ ప్రజలు, తల్లులు, బిడ్డలకు చెబుతున్నాను. దేశమంతా మీ వెంట ఉంది. ఈ సభ కూడా మీ వెంట ఉంది. అందరం కలిసి ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొందాం. మళ్లీ శాంతియుత వాతావరణ నెలకొంటోంది. మణిపుర్‌ మళ్లీ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగాలి. ఆ ప్రయత్నాల్లో ఎలాంటి లోపం ఉండదు."
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

ప్రధాని సమాధానం ఇస్తుండగానే.. ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ కారణంగా ప్రతిపక్షాలు తెచ్చిన అవిశ్వాస తీర్మానం.. మూజువాణి ఓటుతో వీగిపోయినట్టు స్పీకర్‌ ప్రకటించారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదావేశారు.

'NDA మూడోసారి అధికారంలోకి వస్తే.. మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్'

'అది అవినీతి నేతల సమూహం.. వారి దుకాణాల్లో కరప్షన్ అన్​లిమిటెడ్!'

Last Updated : Aug 10, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details