PM Modi Facts: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడంలో కీలక పాత్ర పోషించారు. నిత్యం చురుకుగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఆయన గురించి ఇప్పటికే కొంత వరకు తెలుసుకున్నాం.. ఈ సారి ఆయన మధుర జ్ఞాపకాలేంటో చదివేద్దాం..
ఆ రోజులు చాలా ఇష్టం
Narendra Modi Interesting Facts: వాద్‌నగర్ రైల్వేస్టేషన్‌లో మాకు టీకొట్టు ఉండేది. మా నాన్నకు సాయంగా నేను కూడా ఆ టీకొట్టు దగ్గరకు వెళ్లేవాడిని. అవి భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న రోజులు. మా స్టేషన్‌లో ఆగిన రైల్లో మన సైనికులు ఉన్నారని తెలిస్తే... పరుగెత్తుకుంటూ వెళ్లి వాళ్లందరికీ టీ ఇచ్చి, సెల్యూట్ కొట్టడం నాకు ఇప్పటికీ గుర్తే. ఆ రోజులు మళ్లీ రావు.
రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే...
సైన్యంలోకి వెళ్లేవాడిని. అవును... చిన్నప్పటినుంచీ నేను సైన్యంలోకి వెళ్లాలని అనుకునేవాడిని. అందుకోసమే జామ్‌నగర్‌లోని సైనిక్‌స్కూల్లోనూ చేరాలనుకున్నా కానీ డబ్బులు లేక ఆ కోరికను వదిలేసుకున్నా.
సన్యాసిని కావాలనుకున్నా
చిన్నప్పటినుంచీ నేను సన్యాసిని కావాలనుకున్నా. అందుకే కొన్నాళ్లు దేశసంచారం చేశా. ఓ రెండేళ్లు హిమాలయాల్లోనూ ఉన్నా. ఆ ప్రయాణంలో ధ్యానం, ఆధ్యాత్మికత వంటివాటి గురించి తెలుసుకున్నా. అవన్నీ నాకు ఇప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతూనే ఉన్నాయి.
మొసలితో సావాసం
స్కూల్లో చదువుతున్నప్పుడు ఓసారి మొసలి పిల్లను ఇంటికి తెచ్చా.. దాన్ని చూసి అందరూ భయపడ్డారు కానీ నేను మాత్రం దాన్ని అలాగే చేతుల్లో పట్టుకున్నా. చివరకు ఇంట్లోవాళ్లు తిట్టడంతో వదిలేయాల్సి వచ్చింది. అదేవిధంగా మా ఊళ్లో ఓ చెరువు ఉండేది. అందులో నలభైవరకూ మొసళ్లు ఉండేవని చెప్పుకునేవారు. ఆ చెరువు దగ్గరకు వెళ్లేందుకు తోటిపిల్లలు భయపడేవారు కానీ... నేను మాత్రం ధైర్యంగా ఈదుకుంటూ అవతలి గట్టు దగ్గరకు వెళ్లిపోయేవాడిని.
బూట్లు ఉండేవి కావు
PM Modi Childhood: చదువుకునేటప్పుడు నాకు బూట్లు కూడా ఉండేవి కావు. రోజూ స్కూలుకు అలాగే వెళ్లవాడిని. నా పరిస్థితిని అర్థంచేసుకున్న మా బంధువు ఒకాయన చివరకు నాకు వైట్ కాన్వాస్‌షూస్‌ని కొనిచ్చాడు. నేనేమో వాటినెప్పుడూ తెల్లగా ఉంచుకునేందుకు... స్కూల్ అయిపోయాక... కిందపడిన చాక్‌పీస్ ముక్కలన్నింటినీ ఏరుకుని తెచ్చుకుని వాటికి రుద్దుకునేవాడిని.