సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు - సొంత పూచికత్తు సమర్పణ - సీఐడీ ఆన్ సీబీఎన్
Published : Jan 13, 2024, 3:38 PM IST
|Updated : Jan 13, 2024, 8:20 PM IST
15:31 January 13
సీఐడీ రీజనల్ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు
Nara Chandrababu at CID Office: ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు, మద్యం కేసుల్లో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయా కేసుల్లో సీఐడీ కార్యాలయాల్లో చంద్రబాబు పూచీకత్తు సమర్పించారు. చంద్రబాబు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా, తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
హైకోర్టు ఆదేశాల మేరకు ఉచిత ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రింగురోడ్డు, మద్యం కేసుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత పూచికత్తును సీఐడీ కార్యాలయాల్లో సమర్పించారు. మొదటగా విజయవాడలోని సీఐడీ కార్యాలయానకి వచ్చిన చంద్రబాబు..ఇసుక కేసులో దర్యాప్తు అధికారులకు పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల విలువ గల బాండ్ ఇచ్చారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు కనిపించకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. తెలుగుదేశం శ్రేణులు, బారికేడ్లు తోసుకుంటూ కార్యాలయం వరకు చొచ్చుకెళ్లారు. తప్పుడు కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
ఆ తర్వాత తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్ వెంట ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మొహరించారు. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించ లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ పై సీఐడీ అధికారులకు చంద్రబాబు పూచీకత్తు సమర్పించారు.