Nanded Hospital Death News :మహారాష్ట్ర-నాందేడ్‌లోని శంకర్‌రావు చావన్ ప్రభుత్వాస్పత్రిలో మరణ మృదంగం మోగుతోంది. గత 24గంటల్లో 24మరణాలతో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ ఆస్పత్రిలో తాజాగా మరో ఏడుగురు మృతి చెందారు. 48 గంటల్లో చనిపోయినవారి సంఖ్య 31కి పెరిగింది. వారిలో 16మంది నవజాత శిశువులు/ చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, 76 మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల్లో కొందరు పాము కాటుకు గురైనవారు కాగా మరికొందరు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారున్నారని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.
'చివరి దశలో రోగులు వచ్చారు'
అయితే, ఔషధాలు, సిబ్బంది కొరత వల్లే ఈ దారుణం జరిగిందనే ఆరోపణలను ఆస్పత్రి డీన్ శ్యామ్‌రావు తోసిపుచ్చారు. మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ రోగులు స్పందించటం లేదన్నారు. చాలా మంది రోగులు చివరి దశలో ఆసుపత్రికి వచ్చారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది పేషెంట్స్ వచ్చారని చెప్పారు. రోగులను రక్షించడానికి ఆస్పత్రి వైద్యులు సాయశక్తులా కృషి చేస్తున్నారని డీన్ వివరించారు.
ఘటనపై విచారణకు కమిటీ
నాందేడ్ మరణాలపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంబంధిత ఆస్పత్రిని సందర్శించి పూర్తి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక అందించనుంది. మరోవైపు ఏక్‌నాథ్ శిందే సర్కార్‌పై విపక్షాలు ఎదురుదాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని మండిపడ్డాయి.