జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లు.. వాటి పక్కన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలి పోయిన ఇళ్లు.. ఎవరైనా తిరిగొస్తారేమో అని ఆశగా ఎదురు చూసే వాకిళ్లు.. ఇవన్నీ దెయ్యం నేపథ్యంగా సాగే సినిమాల్లో కనిపించే సన్నివేశాలు. అయితే.. ఆ భావన, భయం అన్నీ రెండున్నర గంటలే. కానీ ఒడిశాలోని నయాగడ్ జిల్లా రాణాపూర్ బ్లాక్ పరిధి గుండురుబడి గ్రామానిది ఏడాదిగా ఇదే దుస్థితి. మరణం కన్నా మరణభయమే వారిని ఆ ఊరి ప్రజలను వెంటాడగా.. ఒక్కొక్కరుగా ఇళ్లు వాకిలి వదిలి గ్రామం వెలుపలకు చేరారు. దీనికి కారణం.. దెయ్యం భయం.ఆ భయానికి కారణం.. నాలుగేళ్లలో ఐదుగురు మగవాళ్లు ఏ కారణం లేకుండా చనిపోవడమే.
అందులోనూ ఇద్దరు కొత్తగా పెళ్లైన కురాళ్లు. వీరి చావుతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. తాంత్రికులను సంప్రదించగా ఊరొదిలితే కానీ ప్రాణాలు దక్కవంటూ.. ఆ తాంత్రికులు మరింతగా భయపెట్టారు. ఇక చేసేదేమీ లేక.. ఊరు వదిలి పోతున్నారు. ఊరు వదిలిపోలేని వాళ్లు సూర్యాస్తమయం అయ్యిందంటే దెయ్యం భయంతో గడప దాటి బయటకు రావడం లేదు.
''గత ఏడాది పెళ్లైన ఇద్దరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండానే చనిపోయారు. దాంతో అందరూ భయపడిపోయారు. ఇక్కడ దెయ్యం ఉందన్న భయాందోళన.. అందరిలోనూ ఉంది. ఆ విషయాన్ని నలుగురు తాంత్రికుల దగ్గర చెబితే.. వాళ్లు ఊరి వదిలి పొమ్మన్నారు. వాళ్ల సలహాతో అందరూ దెయ్యం బారి నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి ఊరు వదిలి పోతున్నారు.''
-గుండురుబడి గ్రామస్థుడు, ఒడిశా
దెయ్యం కేవలం మగవాళ్లపైనే పగబట్టిందని గుండురుబడి గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు. మగవాళ్లు అందునా కొత్తగా పెళ్లైన వారి శరీరంలోకి ఆ దెయ్యం ప్రవేశించి.. వారిని చంపేస్తుందంటూ తాంత్రికులు చెప్పింది గ్రామస్థులు నమ్మతున్నారు. అందుకే ప్రాణాలను రక్షించుకునేందుకు ఊరొదిలి పోతున్నామని అంటున్నారు.
''చాలా భయంగా ఉంటోంది. ఇక్కడ మేము ఉండలేక పోతున్నాం. ఏం చేయలేక పోతున్నాం. ఊరొదిలి వెళ్లిపోతే కానీ ప్రాణాలకు రక్షణ ఉండదని అందరూ అనుకుంటున్నారు. అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని భావనకు వచ్చాం.''