Jignesh Mevani On BJP: గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేశ్ మేవాణి భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనను అసోం పోలీసులు అరెస్ట్ చేయాలని ప్రధానమంత్రి కార్యాలయ కుట్ర పన్నిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే తనను అరెస్ట్ చేశారని.. దీనిని '56 అంగుళాల పిరికిపంద చర్య'గా ఆయన అభివర్ణించారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే 56 అంగుళాల ఛాతి ఉండాలంటూ గతంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇలా అన్నారు జిగ్నేశ్.
'మహాత్మా దేవాలయం'గా భావించే గుజరాత్లో శాంతి సామరస్యం కోసం మోదీ పిలుపునివ్వాలనే తాను ట్వీట్ చేశానని చెప్పారు. వారు గాడ్సే భక్తులు కాకపోతే ఎర్రకోట నుంచి 'గాడ్సే ముర్దాబాద్' అనాలని సవాల్ చేశారు. తీవ్రవాది అని ట్వీట్ చేసినందుకు తనను అరెస్ట్ చేయడంలో భాజపాకు ప్రయోజనం లేదని.. గుజరాత్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొనే కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం అని మేవాణి అన్నారు.