ముస్లింల వివాహంపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం వివాహం హిందూ మతంలో జరిగినట్లుగా ధార్మికమైనది కాదని పేర్కొంది. ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు అని (Muslim Marriage Rules), అది రద్దైనప్పటికీ బాధ్యతలు రద్దు కావని వ్యాఖ్యానించింది. బెంగళూరుకు చెందిన ఎజాజుర్ రెహ్మాన్(52) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది. (Karnataka High Court judgement)
కేసు ఏంటంటే...
బెంగళూరులోని భువనేశ్వరి నగర్‌కు చెందిన ఎజాజుర్ రెహ్మాన్ అనే వ్యక్తి రూ.5000 కట్నం చెల్లించి సైరా బానును వివాహం చేసుకున్నాడు. 1991 నవంబర్ 5న ముమ్మారు తలాక్ చెప్పి సైరా బానుకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మరొక మహిళను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు రెహ్మాన్. ఈ క్రమంలో 2002 ఆగస్టు 24న సైరా బాను.. నిర్వహణ ఖర్చుల కోసం రెహ్మాన్‌పై కేసు వేసింది.
దీనిపై బెంగళూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి మహిళకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సైరా బాను మరో వివాహం చేసుకునేంత వరకు, లేదంటే ఇరువురిలో ఒకరు మరణించేంత వరకు రెహ్మాన్.. నెలకు రూ. మూడు వేల చొప్పున మహిళకు చెల్లించాలని ఆదేశించారు. దీన్ని సవాల్ చేస్తూ రెహ్మాన్.. హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి (Karnataka High Court judge) జస్టిస్ కృష్ణ దీక్షిత్ తీర్పు చెప్పారు.