ప్రపంచంలో ఎన్నో గొప్ప ప్రేమకథలు చరిత్రలో నిలిచిపోయాయి. వాటిల్లో కొన్ని కథలు సుఖాంతమైతే, మరికొన్ని తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి. అలాంటి ప్రేమకథలు రోజువారీ జీవితంలో ఎన్నో వింటుంటాము. కానీ ముంబయిలో వెలుగుచూసిన ప్రేమకథ మాత్రం వాటన్నింటికీ భిన్నం. ప్రేమ కోసం, ప్రేమికుడితో సంతోషంగా ఉండటం కోసం.. ఓ వ్యక్తి ఏకంగా తన లింగాన్నే మార్చేసుకున్నాడు! చివరకు ఆ ప్రేమికుడి చేతిలో మోసపోయాడు.
ప్రియుడి మాటలు నమ్మి...
15 ఏళ్ల వయస్సులోనే కోల్‌కతా నుంచి కుటుంబంతో పాటు ముంబయికి వచ్చాడు జమాల్ షేక్. ఏడాదిన్నర క్రితం ఫుర్ఖాన్ షేక్‌తో ప్రేమలో పడ్డాడు. లింగ మార్పిడి చేసుకోవాలని, ఆ తర్వాత ఎంతో ప్రేమగా చూసుకుంటానని జమాల్‌కు మాటిచ్చాడు ఫుర్ఖాన్. ఆ మాటలను నమ్మి రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఆపరేషన్ చేయించుకున్నాడు 31ఏళ్ల జమాల్. ఆ తర్వాత తన పేరును శిల్పగా మార్చుకున్నాడు.
లింగ మార్పిడి చేసుకున్న తర్వాత తన జీవితం మారిపోతుందని, ఫుర్ఖాన్ చెప్పినట్టు సంతోషంగా ఉండొచ్చని కలలు కన్న జమాల్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. జమాల్‌ను ఫుర్ఖాన్ మోసం చేశాడు. ముంబయిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో జమాల్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.