కరోనా వచ్చింది.. పార్కులు మూతపడ్డాయి.. సముద్ర తీరాల్లో ఎక్కువ సేపు గడిపే వీలు లేకుండా పోయింది. మరి కాసింత ఏకాంతం దొరికేది ఎక్కడా? ఇలాంటి వారికి ముంబయిలోని బోరీవలీలో 'సత్యం, శివం, సుందరం సొసైటీ' ఎదురుగా ఉన్న రహదారి చక్కని పరిష్కారంగా కనిపించింది. అంతే సాయంత్రం 5 గంటలు కొట్టగానే ద్విచక్ర వాహనాలు, కార్లలో అక్కడకు చేరుకున్న జంటలు చీకటి పడే వరకు కబుర్లు చెప్పుకొనేవారు. పనిలోపనిగా 'ముద్దు'మురిపాలలో మునిగి తేలేవారు.
ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. ఎదురుగా ఉన్న భవనంలోని వారికి మాత్రం పదేపదే ఈ దృశ్యాలు చూడాల్సి రావడం కాస్తంత ఇబ్బందిగా అనిపించింది. దీంతో మొబైల్ ఫోన్లలో ఒకటి రెండు దృశ్యాలను చిత్రీకరించి స్థానిక కార్పొరేటర్ వద్దకు వెళ్లి చూపించి సమస్యను వివరించారు. అనంతరం ఆయన సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచీ పెద్దగా చర్యలు లేకపోవడం వల్ల అంతా చివరకు ఇలా రహదారిపై 'నో కిస్సింగ్ జోన్' అని రాయించారు. ఇలా రాసినప్పటి నుంచి అక్కడకు వచ్చే జంటల సంఖ్య తగ్గిందని 'సత్యం, శివం, సుందరం' సొసైటీ నివాసులు చెబుతున్నారు.