దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అశేష జనవాహిని మధ్య ఇటావా జిల్లాలోని ములాయం స్వస్థలం సైఫైలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్.. తండ్రి చితికి నిప్పంటించారు.
సోమవారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ములాయం మరణించగా ఆయన భౌతిక కాయాన్ని.. స్వస్థలం ఇటావాలోని సైఫై గ్రామానికి తరలించారు. తమ అభిమాన నేతకు తుదివీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు, సమాజ్ వాదీ పార్టీకార్యకర్తలు సైఫైకి తరలివెళ్లారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు, కార్యకర్తలు 'నేతాజీ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. పలువురు రాజకీయ నేతలు కూడా.. ములాయం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, పార్టీ ఎంపీలతో కలిసి ములాయం సింగ్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ను పరామర్శించారు.