బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా రూపొందించిన 'లవ్ జిహాద్' బిల్లును ఆర్డినెన్సు రూపంలో తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ సర్కార్. కరోనా కారణంగా అసెంబ్లీ సమావేశాలు రద్దైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్డినెన్సును గవర్నర్ సమ్మతి కోసం పంపించింది.
వివాహాలు, ఇతర మార్గాల ద్వారా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధించేలా 'మత స్వేచ్ఛ బిల్లు 2020'ని రూపొందించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. దీనికి ఆదివారం ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. డిసెంబర్ 28న ప్రారంభించాలనుకున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని యోచించింది. అయితే సమావేశాలు వాయిదా పడటం వల్ల ఆర్డినెన్సు మార్గం ఎంచుకుంది.