Runaway Bride: ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి. భార్యను తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అనూహ్యంగా దారి మధ్యలోనే డబ్బు, నగలతో మాయమైంది వధువు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెప్పిన విషయాలు విని అతడు ఖంగుతిన్నాడు. తనలాగే ఆమె మరో ఏడుగురిని పెళ్లాడి, నట్టేట ముంచేసిందని ఆలస్యంగా తెలుసుకున్నాడు.
ఏం జరిగింది?
దశరథ్ పటేల్(41) మధ్యప్రదేశ్ సియోని జిల్లా వాసి. ఇటీవలే అతడికి అర్చన(40) పరిచయమైంది. బంధువుల అమ్మాయి అని చెప్పి ఊర్మిళా అహిర్వార్(28) అలియాస్ రేణు రాజ్‌పుత్‌తో పెళ్లి కుదిర్చింది అర్చన. సియోని పొరుగు జిల్లా జబల్పుర్లో మంగళవారం దశరథ్-ఊర్మిళ వివాహం అయింది. వధువు బంధువుల్లా అర్చన, అమర్ సింగ్(50), హాజరయ్యారు. ఈ కుటుంబాన్ని పూర్తిగా నమ్మిన దశరథ్.. తన దగ్గరున్న డబ్బు, నగలను ఊర్మిళ, అమర్ దగ్గర ఉంచమని ఇచ్చాడు. భార్యతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు.
కాస్త దూరం వెళ్లాక వాహనం ఆపమని అడిగింది ఊర్మిళ. తనకు ఒంట్లో బాగాలేదని, ఒకసారి కిందకు దిగుతానని చెప్పింది. అదే సమయానికి భాగ్‌చంద్ కోరి(22) అనే యువకుడు బైక్‌పై వచ్చాడు. వెంటనే కారులోని డబ్బు, నగలు తీసుకున్న ఊర్మిళ.. భాగ్‌చంద్ బైక్‌పై ఎక్కి క్షణాల్లో అక్కడి నుంచి మాయమైంది.
ఇదీ చూడండి :ఎనిమిది మంది భార్యల ముద్దుల మొగుడు- ఒకే ఇంట్లో ఖుషీగా కాపురం!
అందరిదీ అదే కథ
కాసేపటికి తేరుకున్న దశరథ్.. ఓమ్టీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగించి గురువారం ఊర్మిళ అలియాస్ రేణు రాజ్‌పుత్, అర్చన, భాగ్‌చంద్, అమర్ సింగ్‌ను అరెస్టు చేశారు. గతంలో ఇలానే ఏడుగురిని మోసగించి, పెళ్లి చేసుకుని.. కొద్దిరోజులయ్యాక డబ్బు, నగలతో పరారైనట్లు విచారణలో ఊర్మిళ ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. బాధితులంతా రాజస్థాన్‌లోని జైపుర్, కోట, ధోల్‌పుర్, మధ్యప్రదేశ్‌లోని దామోహ్, సాగర్‌కు చెందిన వారని వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.