మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ చేసి.. పారిపోతున్న దొంగలను ఓ ఎంపీ సినిమా లెవెల్లో ఛేజ్ చేసి పట్టుకున్నారు. తన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఎనిమిది కిలోమీటర్ల పాటు దొంగలను వెంబడించిన ఆ ఎంపీ.. చాకచక్యంగా వారిని అడ్డగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బిహార్‌లో ఈ ఘటన జరిగింది. ఔరంగాబాద్ పార్లమెంట్ సభ్యుడు సుశీల్ కుమార్ సింగ్.. ఇలా దొంగలను పట్టుకున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం.. బరున్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సిరిస్ గ్రామానికి చెందిన సరిత కుమారి అనే మహిళ.. అనారోగ్యంతో బాధపడుతున్న తన అత్తను చూసేందుకు జముహర్ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అనంతరం బైక్‌పైన తన భర్త రాజేష్ గుప్తాతో కలిసి తిరిగి వస్తోంది. ఆ సందర్భంలోనే ముగ్గురు దొంగలు సరిత మెడలో ఉన్న చైన్‌ను లాక్కుని పారిపోయారు. దీంతో ఆ మహిళ బిగ్గరగా అరిచింది. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న ఎంపీ సుశీల్ కుమార్ సింగ్.. ఘటనను గమనించారు. వెంటనే దొంగలు పారిపోతున్న వైపుగా వెళ్లమని డ్రైవర్‌కు సూచించారు. అలా చాలా సేపు వారిని వెంబడించారు.
ఎంపీ కారు దొంగలకు దగ్గరగా వెళ్లగానే.. వారు సుశీల్ కుమార్ సింగ్‌కు గన్ గురిపెట్టారు. తమ వెంటపడితే కాల్చేస్తామని బెదిరించారు. అయినా సుశీల్ కుమార్ ఏ మాత్రం బెదరలేదు. ఆ దొంగలను విడిచిపెట్టకుండా.. వారిని అలాగే వెంబడించారు. దాదాపు దొరికిపోయారు అనుకున్న సమయంలో ఎంపీ కారుకు ఓ ట్రక్ అడ్డు వచ్చింది. దీంతో అదే అదునుగా భావించిన దొంగలు.. ఎంపీ కారును ఓవర్టేక్ చేసి చాలా దూరం వెళ్లారు. అయినా పట్టువదలకుండా దొంగలను వెంబడించారు ఎంపీ సుశీల్ కుమార్ సింగ్. చివరకు మధుపుర్ అనే గ్రామ సమీపానికి వెళ్లిన దొంగలు.. బైక్ బురదలో కూరుకుపోవడం వల్ల కిందపడ్డారు.