వందేళ్ల నాటి మసీదును ఉత్తర్ప్రదేశ్ బారాబంకి జిల్లా యంత్రాంగం కూల్చేసిందని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆరోపించాయి. దీనిపై న్యాయ విచారణకు డిమాండ్ చేశాయి.
"రామ్ సనేహీ ఘాట్ తహసీల్లో వందేళ్ల పురాతనమైన గరీబ్ నవాజ్ మసీదును జిల్లా యంత్రాంగం కూల్చేసింది. ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండానే పోలీసుల సమక్షంలో మంగళవారం కూల్చేసింది. మసీదు విషయంలో ఎలాంటి వివాదాలు లేవు. ఇది సున్నీ వక్ఫ్ బోర్డ్ పేరుతో నమోదై ఉంది. మసీదుకు సంబంధించిన పత్రాలను చూపించాలని రామ్ సనేహీ ఘాట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గత మార్చిలో అడిగారు. దీనిపై సంబంధిత కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది."
-మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహ్మానీ, ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే మసీదును కూల్చేశారని ఆరోపించారు మౌలానా ఖాలిద్. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మసీదు శిథిలాలను ఆ ప్రాంతం నుంచి తొలగించే ప్రక్రియను ఆపేయాలని కోరారు. ఆ ప్రాంతంలో మరే ఇతర నిర్మాణం చేపట్టకూడదని డిమాండ్ చేశారు. 'ఆ ప్రదేశంలో మసీదును నిర్మించి ముస్లింలకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది' అని అన్నారు.