తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'

ఉపరాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.

monsoon-session-2022
monsoon-session-2022

By

Published : Aug 8, 2022, 11:41 AM IST

Updated : Aug 8, 2022, 12:09 PM IST

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వెంకయ్య పదవీకాలంలో రాజ్యసభ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు. ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్​లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన మోదీ.. వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు. సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు.

"రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు. 'రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నా. ప్రజా జీవితం నుంచి కాదు' అని మీరు చాలా సార్లు చెప్పారు. ఈ సభను నడిపించే బాధ్యత నుంచి మీరు ప్రస్తుతం వైదొలుగుతున్నారు. కానీ, దేశంతో పాటు ప్రజల కోసం పనిచేసే నాలాంటి వ్యక్తులకు మీ అనుభవాల నుంచి నేర్చుకొనే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. వెంకయ్యనాయుడి దక్షత, పనివిధానం.. మనందరికీ మార్గదర్శనం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మీతో భుజం కలపడం అదృష్టం
వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు మెరుగుపడిందని మోదీ గుర్తు చేశారు. రాజ్యసభ ఉత్పాదకత 70 శాతం పెరిగిందని చెప్పారు. ఎంపీల హాజరు సైతం భారీగా పెరిగిందని వెల్లడించారు. వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం లభించడం గొప్ప విషయమని అన్నారు. 'మీ పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకం. పనిపై పెట్టే శ్రద్ధ.. బాధ్యతగా నిర్వర్తించే తీరు ప్రతిఒక్కరికి ఆదర్శం. సభా నాయకుడిగా ఎన్నో బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించారు. కొత్తతరంతో అనుసంధానమవుతూ అత్యంత జనాదరణ ఉన్న నాయకుడిగా.. అనేక బాధ్యతలను విజయవంతంగా చేపట్టారు. మీతో భుజం కలిపి పనిచేసే అదృష్టం నాకు లభించింది. సమాజం, ప్రజాస్వామ్యం గురించి మీ నుంచి చాలా నేర్చుకోవాలి. మీ అనుభవం మీ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. మీ పుస్తకంలోని ప్రతి అక్షరం యువతకు మార్గదర్శనం. మీ పుస్తకాలు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి' అని మోదీ కొనియాడారు.

సభలో ప్రసంగిస్తున్న మోదీ

ఈ సందర్భంగా వెంకయ్య భాషా నైపుణ్యాలపై మోదీ ప్రశంసలు కురిపించారు. వెంకయ్య విసిరే ఛలోక్తుల గురించి ప్రస్తావించారు. 'మన ఆలోచనలు, చెప్పేవన్నీ గొప్పవే.. కానీ చెప్పే విధానమే ప్రజలను కార్యోన్ముఖులను చేస్తుంది. మీ భావ వ్యక్తీకరణ వీనులవిందుగా ఉంటుంది. మీ భాషలో సున్నితత్వం, గంభీరత కలిసి ఉంటాయి. మీ ఏకవాక్య సంబోధనలు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. అత్యంత సహజంగా ఉండే మీ భాష, భావన ప్రజలకు సూటిగా చెప్పే విధానం అనుసరణీయం. సాధారణ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు. వ్యక్తి పురోగతికి భాష, ప్రాంతం ఇవేమీ అడ్డంకులు కావు. ఎన్నో అడ్డంకులు దాటి వచ్చిన మీరు నేటి యువతకు ఆదర్శం. మాతృభాష-కంటిచూపు, పరభాష-కళ్లద్దాలన్న మీ మాట ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి' అని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

వెయ్యికి పైగా కార్యక్రమాలు..
దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని చుట్టిన ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఆయన ప్రతి రాష్ట్రాన్ని, కేంద్రపాలిత ప్రాంతాన్ని చుట్టివచ్చారు. వెయ్యికిపైగా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలను సందర్శించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. విభిన్న అంశాలపై పనిచేసే ప్రజలు, నిపుణులతో మమేకమయ్యారు. భాజపా అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో దేశమంతటా విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉన్న ఆయన ఉపరాష్ట్రపతి హోదాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. భారత్‌ మళ్లీ విశ్వగురు స్థానాన్ని అధిష్ఠించాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. విద్యావంతులు, నిపుణులు, విద్యార్థులు, రైతులు, పౌరసమాజ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఉపరాష్ట్రపతి నివాస భవనంలో ఒక సమావేశ మందిరాన్ని నిర్మింపజేశారు. తన పనితీరును ప్రజల ముందుంచేందుకు 'మూవింగ్‌ ఆన్‌ మూవింగ్‌ ఫార్వర్డ్‌' పేరుతో ఏటా 'కాఫీ టేబుల్‌ బుక్‌'ను తీసుకొచ్చారు.

Last Updated : Aug 8, 2022, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details