MONKEYPOX PRECAUTIONS: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఆదివారం దిల్లీలో బయటపడిన కేసులో.. బాధితుడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్ కట్టడికి కరోనా తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని వెల్లడిస్తున్నారు. దిల్లీలోని ప్రముఖ లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి వైద్యుడు డా.సురేశ్ కుమార్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మంకీపాక్స్‌ను అడ్డుకోవాలంటే కరోనా తరహాలోనే మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డా.సురేశ్ సూచించారు. విదేశీ ప్రయాణాలు చేసినవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కవ అని, వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తే 99శాతం ఈ వైరస్‌ను నివారించవచ్చని తెలిపారు.