Money Heist BJP Congress Issue :కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు సంస్థల్లో పట్టుబడిన రూ.353 కోట్లకుపైగా నగదును ప్రధాని నరేంద్ర మోదీ పాపులర్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్‌తో పోల్చారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా కల్పితమైన, ఊహాజనితమైన మనీ హీస్ట్ వెబ్ సిరీస్ ఎందుకని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
70 ఏళ్లుగా ఆ పార్టీకి చెందిన దొంగలు దోచుకుంటునే ఉన్నారని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ సమర్పించు డబ్బు దోపిడీ అనే క్యాప్షన్‌తో బీజేపీ షేర్ చేసిన వీడియోపై ప్రధాని ఈ మేరకు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో బీజేపీ పోస్ట్ చేసిన ఈ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో దిగిన ఫొటోలతో పాటు మనీ హీస్ట్‌లో ఉన్న ఓ పాత్రకు రాహుల్ ఫొటోతో మార్ఫ్ చేసింది.
ఇదివరకు కూడా సాహు వ్యవహారంపై ప్రధాని స్పందించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అని ట్వీట్ చేశారు. కాగా, మనీహైస్ట్ సిరీస్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో థ్రిల్లింగ్‌గా సాగే వెబ్‌సిరీస్ అది.