ఆశ.. ఓ ఉపాధ్యాయుడిని అప్పుల పాలు చేసింది. పరిచయం లేని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పార్సిల్ వచ్చిందనే సంతోషంతో.. కేటుగాళ్ల వలలో చిక్కున్నాడు. ఆ పార్సిల్ తీసుకోవడం కోసం.. క్రమంగా దాదాపు రూ. 1.85 కోట్లు ఇచ్చాడు. తాను దాచుకున్న డబ్బులతో కలిపి.. రూ. 1.5 కోట్లు వివిధ బ్యాంకుల్లో అప్పుచేసి మరీ మోసగాళ్లకు ముట్టజెప్పాడు. చివరకు తేరుకుని.. పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
నవీన్ శామ్యూల్ సింగ్(53) లఖ్‌నవూ త్రివేణి నగర్‌లోని మాదేయ్గంజ్లో నివాసం ఉంటున్నాడు. టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 4న నవీన్‌కు ఓ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి.. తనను ముంబయి కంపెనీ విల్టన్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ డైరెక్టర్ జాన్ స్పెన్సర్‌గా నవీన్‌కు పరిచయం చేసుకున్నాడు. అతడు పోలాండ్‌కు చెందిన వ్యక్తి అని చెప్పాడు. ఆపై నవీన్‌కు పోలాండ్ నుంచి ఓ పార్సిల్ వచ్చినట్లు.. అందులో రికో బ్రాండ్ వాచ్, నెక్లెస్, బ్రేస్లెట్, ఒక జీ13 మొబైల్ ఫోన్, యాపిల్ నోట్ ప్యాడ్, ఓ పర్ఫ్యూమ్ బాటిల్, ఓ టీ షర్ట్ ఉన్నట్లు తెలిపాడు.
మీలో మాకు నచ్చింది అదే..
పార్సిల్ తీసుకునేందుకు రూ. 38 వేలు చెల్లించాలని తెలిపాడు జాన్. దీంతో కాస్త అనుమానం వచ్చి ఆ పార్సిల్ పంపించిన ఫెలిక్స్ వార్సా అనే మరో వ్యక్తికి ఫోన్ చేశాడు నవీన్. తనకు పోలాండ్‌లో తెలిసిన వాళ్లు ఎవరూ లేరని.. తనకెందుకు పార్సిల్ పంపిస్తున్నారని వార్సాను అడిగాడు. క్రిస్టియానిటీ గురించి మీరు చేసిన కొన్ని వీడియోలు చూశానని.. అందుకే పార్సిల్ పంపించినట్లు వార్సా బదులిచ్చాడు. దీంతో అతడు చెప్పింది నిజమేనని నమ్మి.. జాన్ స్పెన్సర్‌కు రూ. 38 వేలు పంపించాడు నవీన్ శామ్యూల్.