తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిగరెట్ పీకలతో రూ.లక్షలు సంపాదన- ఎలా..?

నిత్యం లక్షలాది మంది పొగ తాగిన అనంతరం సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. వాటితో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. అయితే ఈ సిగరెట్ పీకలతోనే అందమైన కళాకృతులను తయారు చేస్తోంది ఓ రీసైక్లింగ్​ కంపెనీ. ఓ వైపు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూనే.. రకరకాల బొమ్మలు, దోమ తెరలు, దిండ్లు తయారు చేసి, అమ్ముతూ లాభాలు ఆర్జిస్తోంది.

recycling cigarette butts into toys
సిగరెట్ పీకలతో బొమ్మల తయారీ

By

Published : Sep 9, 2021, 6:15 PM IST

Updated : Sep 9, 2021, 8:09 PM IST

సిగరెట్ పీకలతో బొమ్మల తయారీ

దేశవ్యాప్తంగా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ సిగరెట్ పీకలు దర్శనమిస్తుంటాయి. వాటివల్ల అప్పుడప్పుడు అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ కాలుష్యానికీ ఇవి కారణమవుతాయి. అయితే.. వీటిని రీసైక్లింగ్​ చేయటం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తోంది పంజాబ్​కు చెందిన ఓ సంస్థ. సిగరెట్ పీకలతోనే అందమైన బొమ్మలు, దిండ్లు, దుప్పట్లు, దోమ తెరలు తయారు చేస్తోంది.

"లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాను. సిగరెట్ రీసైక్లింగ్​పై యూట్యూబ్​లో వీడియోలు చూశాను. ఆ తర్వాత నాకూ ఈ విధానంపై ఆసక్తి పెరిగింది. నోయిడాలో సిగరెట్​ పీకలను రీసైక్లింగ్ చేస్తున్న కంపెనీకి వెళ్లి స్వయంగా పరిశీలించాను. ఈ సిగరెట్ పీకల ద్వారా పిల్లల బొమ్మలు, దిండ్లు, జూట్​బాక్స్​లు, దోమతెరలు లాంటివి తయారుచేస్తున్నాం."

-- ట్వింకిల్ కుమార్, వ్యవస్థాపకుడు

ఎలా తయారు చేస్తారు?

సిగరెట్ పీకలను శుభ్రం చేస్తూ..
సిగరెట్ పీకలతో బొమ్మల తయారీ

వాణిజ్య ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో బిన్​లను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా సిగరెట్ పీకలను సేకరిస్తున్నారు. అలా సేకరించిన సిగరెట్ ముక్కలను రసాయనాల సాయంతో శుభ్రం చేస్తారు. అలా చేయటం వల్ల అందులోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత వాటిని వివిధ వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.

సిగరెట్ పీకలు పడేసేందుకు బిన్​లు

"ఈ విధానం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. ఈ సిగరెట్ పీకలు పదేళ్లయినా మట్టిలో కలిసిపోవు. ఇవి నీరు, గాలి, మట్టి అన్నింటినీ కలుషితం చేస్తాయి. మేము ఉత్తరభారతంలోని పలు ప్రాంతాల్లో స్మోకింగ్ జోన్స్ వద్ద బిన్​లను ఏర్పాటు చేశాం. అలా సేకరించిన సిగరెట్ పీగలను రీసైక్లింగ్​ చేస్తున్నాం."

-- ట్వింకిల్ కుమార్, వ్యవస్థాపకుడు

పొగ తాగాక సిగరెట్ పీకలను తాము ఏర్పాటు చేసిన కలెక్షన్ బాక్స్​ల్లోనే వేయాలని కంపెనీ వ్యవస్థాపకుడు ట్వింకిల్ కుమార్ కోరారు. కేటాయించిన డస్ట్​బిన్​లో వేస్తే.. పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. సిగరెట్ పీకల సేకరణ, ప్రాసెసింగ్, తయారీలో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి పాము.. చివరకు...

Last Updated : Sep 9, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details