Gujarat Elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. పూర్తయిన వాటిని ప్రారంభించారు. అనేక సభల్లో ప్రసంగించారు. ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందు నెలల్లో రాష్ట్ర పర్యటనల్లో రికార్డు సృష్టించారు. గతంలో ఏ ప్రధానమంత్రీ ఒక రాష్ట్రంలో ఇన్ని యాత్రలు జరిపి ఉండకపోవచ్చు. మోదీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సహా ఏ ప్రతిపక్షమూ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడంలేదు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బరిలో దిగినప్పటి నుంచి పరిస్థితి వేడెక్కింది.
భాజపా పైచేయి
గుజరాత్‌లో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీయే భాజపాకు ప్రధాన పోటీదారుగా నిలిచింది. పటిష్ఠ నాయకత్వం లేకపోవడం, సంస్థాగతంగా సమన్వయంతో కృషి జరపకపోవడం వల్ల హస్తం పార్టీ వరసగా ఓటములు చవిచూస్తూ వచ్చింది. దీనివల్ల గుజరాత్‌లో ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి ఆప్ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ ఇప్పటిదాకా జరిగిన ఏ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. పూర్వాశ్రమంలో పాత్రికేయుడైన ఇసుదాన్ గఢ్వీని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్ ఎంపిక చేసింది. భాజపాకు మెజారిటీ వస్తే భూపేంద్ర పటేలే సీఎంగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అయితే, పార్టీ పరంగా దానిపై సాధికార ప్రకటన వెలువడలేదు.
గుజరాత్ తొలి అసెంబ్లీ ఎన్నికలు 1962లో జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గుజరాత్ రెండో ముఖ్యమంత్రి బల్వంత్‌రాయ్ మెహతా 1965లో కచ్ సరిహద్దు వెంబడి విమానంలో ప్రయాణిస్తుండగా, దాన్ని పాక్ కూల్చేయడంతో మరణించారు. 1971 నుంచి గుజరాత్‌లో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. 1973లో అవినీతికి వ్యతిరేకంగా గుజరాత్ విద్యార్థులు నిర్వహించిన నవ నిర్మాణ్ ఉద్యమం అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ రాజీనామాకు దారితీసింది.
1975లో బాబూభాయ్ జశ్‌భాయ్ పటేల్ నాయకత్వంలోని జనతా మోర్చా గుజరాత్‌లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరవాత కొద్దినెలలకే ఆత్యయిక పరిస్థితి కారణంగా ఆయన ప్రభుత్వం కూలిపోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. 1980లో మాధవ్ సింహ్ సోలంకీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1985 ఎన్నికల్లో 149 అసెంబ్లీ సీట్లతో గెలిచింది. పలు సామాజిక వర్గాల ఓటు బ్యాంకును కూడగట్టడం ద్వారా భారీ విజయం సాధ్యపడింది.