Modi Surname Case In Supreme Court : మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్‌ను సూరత్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చడంపై స్టే విధించింది. రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా జీవితంలో ఉన్న వారు బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరువు నష్టం కేసులో గరిష్ఠ శిక్ష అయిన రెండేళ్ల జైలు శిక్షను రాహుల్‌కు ఎందుకు విధించారో సూరత్ కోర్టు సరైన కారణాలు చూపలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.
'అవిశ్వాసంపై రాహుల్ మాట్లాడాలి.. అనర్హత రద్దు చేయండి'
అనర్హత కేసులో రాహుల్‌గాంధీకి సుప్రీం కోర్టు ఉపశమనం కలిగించడం ద్వారా సత్యం గెలిచిందని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురి అన్నారు. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు తెలిపారు. అనర్హత రద్దును ఆలస్యం చేస్తే.. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని.. ఆలస్యం చేయవద్దని స్పీకర్‌ను కోరినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ మాట్లాడాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం స్పందించిన రాహుల్ గాంధీ.. ఏది ఏమైనా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టనని వ్యాఖ్యానించారు. భారత్ అనే భావనను పరిరక్షించడమే తన ధ్యేయమని ట్వీట్ చేశారు.
ఇది విద్వేషంపై విజయం : కాంగ్రెస్
రాహుల్‌గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించటం పట్ల.. కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యలయం వద్దకు కాంగ్రెస్ అభిమానులు చేరుకుని.. రాహుల్ ఫొటో మాస్కులు ధరించి ఉత్సాహంగా నినాదాలు చేశారు.
'ఇది విద్వేషంపై గెలుపు. సత్యమేమ జయతే' అని కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు సత్యాన్ని బలపరిచిందని కాంగ్రెస్ పేర్కొంది. ద్వేషంపై ప్రేమ సాధించిన విజయంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అభివర్ణించింది. భారతీయ జనతా పార్టీ అవిశ్రాంతంగా శ్రమించినప్పటికీ.. రాహుల్‌గాంధీ లొంగకుండా న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ట్వీట్ చేశారు.