Modi On Employment :పునరుత్పాదక ఇంధనం, రక్షణ పరిశ్రమ, ఆటోమేషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. కేంద్ర సాయుధ బలగాలకు ఎంపికైన 51వేలకు పైగా ఉద్యోగులకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు.
కొన్ని లక్షల మందికి..
"గతేడాది అక్టోబర్లో ప్రారంభించిన రోజ్‌గార్ మేళా.. అరుదైన మైలురాయిని చేరుకుంది. అప్పటి నుంచి కొన్ని లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లు అందించాం. నేడు 51,000 మందికి పైగా అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేశాం. కొత్త రిక్రూట్ అయిన కుటుంబాలుకు ఇది దీపావళికి ముందు దివాళి పండుగ లాంటిది" అని ప్రధాని మోదీ తెలిపారు.
"రోజ్‌గార్ మేళా.. యువత పట్ల మా ప్రభుత్వం నిబద్ధతను చూపుతుంది. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ సర్కార్ మిషన్ మోడ్లో పనిచేస్తోంది. మేం కేవలం అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేయడమే కాకుండా.. వ్యవస్థను పారదర్శకంగా మార్చాం. భారత్.. కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించింది. కొద్ది రోజుల క్రితం.. గుజరాత్లోని ధోర్డో గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ఉత్తమ పర్యటక గ్రామంగా ప్రకటించింది. అంతకుముందు కర్ణాటకలోని హోయసల ఆలయం, బంగాల్లోని శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ దేశాలుగా గుర్తించింది. ఇది ఉపాధి అవకాశాలను, ఆర్థిక వ్యవస్థ విస్తరణను పెంచింది. పర్యటకం పెరిగితే ప్రతి రంగానికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి" అని మోదీ చెప్పారు.