Modi Mann Ki Baat Today :2023లో భారత్ అనేక రంగాల్లో విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఏడాది దేశ ప్రజల్లో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని, దాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై దేశ ప్రజలు ప్రత్యేక దృష్టి సారించాలని మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్‌లో ప్రధాని సూచించారు. దేశ ప్రజలకు మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫిట్ ఇండియా సాకారం దిశగా ముందుకు సాగాలని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, నటుడు అక్షయ్ కుమార్ ఫిట్‌నెస్ చిట్కాలను ఈ కార్యక్రమంలో మోదీ వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం సహా ఈ ఏడాది భారత్ ఎన్నో ప్రత్యేక విజయాలను సాధించిందని ప్రధాని గుర్తు చేశారు.
'దేశ ప్రజల్లో స్వయం సమృద్ధి స్ఫూర్తి రగిలింది'
భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.