కొవిడ్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. ఆహార ధాన్యాలు అందించే ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ అన్న యోజనను దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించనున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ మేరకు పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి గరీభ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని దీపావళి వరకు కొనసాగిస్తాం. మహమ్మారి సమయంలో పేదల ప్రతి అవసరాన్ని తీర్చేందుకు వారి సహచరుడిగా ప్రభుత్వం అండగా ఉంటుంది. నవంబర్ వరకు 80కోట్ల మందికిపైగా దేశ ప్రజలకు ప్రతి నెల ముందు ప్రకటించిన మేరకు ఉచిత బియ్యం అందుతుంది. దేశంలోని పేదవారంతా ఆకలితో నిద్ర పోరాదన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నాం."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి