తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యథాతథంగా సైనిక ఆధునికీకరణ' - ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే

మిలిటరీ నవీకరణ సంతృప్తికరంగా జరుతున్నట్లు చెప్పారు భారత సైన్యాధిపతి​ ఎంఎం నరవాణే. గత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.21 వేల కోట్ల విలువైన కొత్త కాంట్రాక్టులు చేసుకున్నట్లు తెలిపారు. క్వాడ్​ను సైనిక కూటమిగా పేర్కొంటూ వస్తోన్న ఆరోపణలను ఖండించారు.

Modernisation of Indian Army
భారత ఆర్మీ చీఫ్

By

Published : May 30, 2021, 10:02 PM IST

Updated : May 31, 2021, 6:54 AM IST

సైనిక దళాల ఆధునికీకరణ సంతృప్తికరంగా జరుగుతోందని ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవాణే వెల్లడించారు. ఆంగ్ల వార్త సంస్థ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. చైనాతో ఉద్రిక్తతల కారణంగా అత్యవసర ఖర్చుల కోసం భారీగా నిధులు వెచ్చించడం దళాల నవీకరణపై ప్రభావం చూపిస్తుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.21వేల కోట్లు విలువైన 59 కొత్త కాంట్రాక్టులను చేసుకొన్నామన్నారు. మరికొన్ని కాంట్రాక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఆర్మీ ఆధునికీకరణకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని ఆయన తెలిపారు.

"భారత సైన్యం ఆధునికీకరణ సంతృప్తికరంగా జరుగుతోంది. ఇటీవలే రూ.16వేల కోట్లు విలువైన 15 కాంట్రాక్టులను సాధారణ కొనుగోలు విధానంలో పూర్తి చేశాము. మరో రూ.5 వేల కోట్లు విలువైన 44 కాంట్రాక్టులను అత్యవసర కొనుగోళ్ల విధానంలో కొన్నాము" అని నరవాణే పేర్కొన్నారు. లద్దాఖ్​లో మోహరింపుల కారణంగా సైనిక దళాల ఆధునికీకరణ ఏమాత్రం ప్రభావితం కాలేదని వెల్లడించారు.

ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో సైనిక దళాలకు రూ.4.78లక్షల కోట్లు కేటాయించింది. దీనిలో కేవలం రూ. 1,35,060 కోట్లు ఆయుధాలు, విమానాలు, నౌకల కొనుగోళ్లకు సంబంధించిన వాటికి వినియోగించాలి. గతేడాది పోలిస్తే ఈ పద్దుకు కేటాయించిన మొత్తం 18.75శాతం పెరిగింది. చైనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే సైనిక దళాలను వేగంగా ఆధునికీకరించాలని పలు నివేదికలు పేర్కొన్నాయి.

'క్వాడ్​ సైనిక కూటమి కాదు'

క్వాడ్​ను సైనిక కూటమిగా చిత్రీకరిస్తూ కొన్ని దేశాలు లేని పోని భయాలు సృష్టిస్తున్నాయని నరవాణే పేర్కొన్నారు. వాటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. మిలిటరీ కూటమిగా మారే ఉద్దేశం క్వాడ్​ లేదని, అది కేవలం ఇండోపసిఫిక్​కు సంబంధించిన వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన కూటమని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:Army Chief:'ఉగ్ర ఏరివేతను ఆపేస్తున్నట్లు కాదు'

Last Updated : May 31, 2021, 6:54 AM IST

ABOUT THE AUTHOR

...view details