తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోడెర్నా టీకా: 6 నెలలైనా అదే సామర్థ్యం! - మోడెర్నా కరోనా టీకా సామర్థ్యం

మోడెర్నా కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత కూడా అద్భతంగా పనిచేస్తోందని ఆ సంస్థ తెలిపింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో టీకా 90 శాతం సామర్థ్యం చూపిందని మరోసారి స్పష్టం చేసింది.

Moderna vaccine
మోడెర్నా టీకా

By

Published : Apr 14, 2021, 10:22 PM IST

ఎంఆర్‌ఎన్‌ఏ-1273 కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత కూడా అద్భుత పనితీరు కనబరుస్తుందని మోడెర్నా సంస్థ ప్రకటించింది. వైరస్‌ను ఎదుర్కోవడంలో టీకా 90 శాతం సామర్థ్యం చూపిందని మరోసారి స్పష్టం చేసింది. ఇక వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో వ్యాక్సిన్‌ 95 శాతం ప్రభావశీలత కలిగివుందని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ప్రయోగ వివరాలు, టీకా సరఫరాపై తాజా సమాచారాన్ని మోడెర్నా విడుదల చేసింది.

సార్స్‌-కోవ్‌-2ను ఎదుర్కొనే యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంతోపాటు కొత్త రకాలపైనా తమ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. 'ఎంఆర్‌ఎన్‌ఏ-1273' పేరుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ సురక్షితమని ఇప్పటికే నిరూపితమైనట్లు కంపెనీ గుర్తు చేసింది. క్లినికల్ ట్రయల్స్‌ పూర్తి చేసుకొని 6 నెలలు గడుస్తోన్న నేపథ్యంలో.. రెండో డోసు తీసుకున్న వారిపై అధ్యయనం కొనసాగించారు. ఇలా మూడోదశలో భాగంగా కోవ్‌ పేరుతో వ్యాక్సిన్‌ తీసుకున్న 900 కేసుల సమాచారాన్ని విశ్లేషించారు. అమెరికాలో గత డిసెంబర్‌ 20న అందుబాటులోకి వచ్చిన ఈ టీకాను పలు దేశాల్లో 13 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మోడెర్నా టీకా వినియోగానికి 40 దేశాలు అనుమతించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వివిధ కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంతకాలం ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు వీటి ప్రభావం ఉంటుందని చెబుతున్నప్పటికీ మరింత పరిశోధన జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ప్రభావశీలతను ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. ఇందులో భాగంగా మోడెర్నా చేసిన తాజా ప్రకటన కాస్త ఊరట కలిగిస్తోంది.

ఇదీ చదవండి:ఆస్పత్రి నుంచి 320 కొవాగ్జిన్​ డోసులు చోరీ

ABOUT THE AUTHOR

...view details