రాజస్థాన్‌లో ఓ వివాహితపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి ఆమెపై వెనుకనుంచి కాల్పులు జరిపారు. ఈ దారుణం వెనుక ఆమె అత్తమామలు, మరికొందరి కుట్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తాను మరో మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందునే ఈ దాడి జరిగిందని బాధితురాలు పోలీసులుకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజస్థాన్ జైపుర్‌లోని మురళీపుర్ ప్రాంతంలో అంజలి అనే 26 ఏళ్ల వివాహితపై.. బుధవారం ఉదయం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అంజలి 2021లో వేరే మతానికి చెందిన అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. లతీఫ్ కుటుంబ సభ్యులకు ఆ వివాహం ఇష్టం లేదు. దీంతో లతీఫ్ భట్టబస్తీలోని తన కుటుంబాన్ని విడిచిపెట్టి.. అంజలితో పాటుగా మురళీపుర్ ప్రాంతంలో జీవిస్తున్నాడు. దీంతో అబ్దుల్ లతీఫ్ కుటుంబ సభ్యులు అంజలిపై కోపాన్ని పెంచుకున్నారు.
ఎప్పటిలానే బుధవారం ఉదయం కూడా.. అంజలి తాను పనిచేస్తున్న మందుల షాప్‌కు కాలినడకన బయలుదేరింది. ఉదయం 10 గంటల సమయంలో అంజలి షాప్‌కు వెళ్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెనుకనుంచి స్కూటీపై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. వెంటనే గాయపడిన అంజలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే బుల్లెట్ శరీర వెనక భాగంలో తగలడం వల్ల.. భవిష్యత్‌లో వెన్నెముకకు సంబంధించిన సమస్యలు రావచ్చని వైద్యులు తెలిపారు.
ఈ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తనపై దాడి చేసింది రియాజ్ ఖాన్, మజీద్ ఖాన్ అనే ఇద్దరు యువకులు అని ఫిర్యాదు చేసింది బాధితురాలు. తన అన్నయ్య అబ్దుల్ అజీజ్ దుకాణంలో రియాజ్ ఖాన్ కొంతకాలం పనిచేసి.. 7 నెలల క్రితం అక్కడ నుంచి వేరే దుకాణానికి వెళ్లిపోయాడని లతీఫ్ తెలిపాడు. అలాగే రియాజ్ ఖాన్ పలుమార్లు తన భార్యకి ఫోన్ చేసి వెన్నెముకను కాల్చివేస్తానని బెదిరించేవాడని ఆరోపించాడు. దీంతో ఈ కాల్పుల వెనుక అజీజ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.