Minor girl gang rape: రాజస్థాన్ చురులో దారుణం జరిగింది. తనతో స్నేహానికి ఒప్పుకోలేదని ఓ మైనర్పై తన మిత్రులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు యువకుడు. రతన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసుకుంది. పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరి పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. నిందితులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. బాధితురాలిని తీవ్రంగా హింసించారు. ముఖం, శరీర భాగాలపై గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.
Rajasthan Minor rape:బాధితురాలు పదో తరగతి చదువుతోంది. తనతో స్నేహం చేయాలని తమ ఇంటిదగ్గర ఉండే కిషోర్ అనే వ్యక్తి రెండేళ్ల క్రితం అడిగాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. అందుకు నిరాకరించినా.. నిందితుడు ఏదో విధంగా తరచూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. 'ఏడాదిన్నర క్రితం అతడు రాత్రి సమయంలో కలవాలని కోరాడు. పొలం దగ్గరకు రావాలని పిలిచాడు. అక్కడ నాపై అత్యాచారం చేశాడు. వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ప్రతిరోజూ అత్యాచారం చేసేవాడు. నిందితుడికి భయపడి ఇంట్లో ఎవరికీ ఈ విషయం గురించి చెప్పలేదు' అని బాధితురాలు తెలిపింది.