తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకటో తరగతి అడ్మిషన్​కు కొత్త రూల్- పక్కాగా అమలు చేయాల్సిందే! - చిన్నారుల అడ్మిషన్ రూల్

పాఠశాలల్లో చిన్నారుల అడ్మిషన్​కు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన చేసింది. ఒకటో తరగతిలో చేర్చుకునే చిన్నారులకు కనీసం ఆరేళ్లు ఉండాలనే నిబంధనను పక్కా అమలు చేయాలని స్పష్టం చేసింది.

minimum-age-for-admission-in-class-1
minimum-age-for-admission-in-class-1

By

Published : Feb 22, 2023, 3:52 PM IST

Updated : Feb 22, 2023, 4:27 PM IST

స్కూళ్లలో చిన్నారుల అడ్మిషన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కనీసం ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. కనిష్ఠ వయసును ఆరేళ్లుగా పేర్కొన్న కేంద్రం.. ఈ నిబంధన అమలయ్యేలా చూడాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన విద్యా విధానంలోనూ ఈ మేరకు నిబంధన ఉన్న విషయాన్ని విద్యా శాఖ గుర్తు చేసింది. దాని ప్రకారం మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫౌండేషన్ స్టేజ్​లో భాగంగా విద్య నేర్పాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించేలా ప్రీ-స్కూల్ విద్య ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండో తరగతులు ఫౌండేషన్ స్టేజ్​లో ఉంటాయి. అయితే ఒకటో తరగతిలో చేరే ముందే.. చిన్నారులకు నాణ్యమైన ప్రీస్కూల్ విద్య అందేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర విద్యా శాఖ సీనియర్ అధికారి సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వయసు నిబంధనను నూతన విద్యా విధానానికి అనుగుణంగా మార్చుకోవాలని స్పష్టం చేశారు.

దేశంలోని విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాలిస్తూ నూతన విధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. బట్టీ పట్టే చదువులకు స్వస్తి చెప్పి.. సృజనాత్మకతకు పెద్ద పీట వేయడమే లక్ష్యంగా నూతన విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక, ఉన్నత విద్య తీరు తెన్నులను పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు విద్యా విధానం 10+2+3గా ఉండగా.. దాన్ని 5+3+3+4గా మార్చింది. ఆర్ట్స్​, సైన్స్​ విద్య మధ్య విభజనలు లేకుండా నచ్చిన సబ్జెక్టులు ఎంపిక చేసుకునే వెసులుబాటును విద్యార్థులకు కట్టబెట్టేలా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల్లోనూ ప్లేస్కూల్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ 2.0 కింద ప్లేస్కూల్స్​ ఏర్పాటు చేసి, అందుకోసం ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Last Updated : Feb 22, 2023, 4:27 PM IST

ABOUT THE AUTHOR

...view details