Ajit Pawar NDA : అనుమానాలే.. నిజమయ్యాయి. కొద్దికాలంగా శరద్ పవార్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. అధినేతపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ఉండగా.. ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. ప్రమాణం చేశారు. పవార్‌తోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి తట్కరే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్ ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ముంబయిలోని రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం ఏక్‌నాథ్ శిందేతో అజిత్ పవార్ సమావేశమయ్యారు. అప్పటినుంచే స్తబ్దుగా ఉన్న అజిత్ పవార్.. అకస్మాత్తుగా NDAలో చేరడం ఎన్సీపీలో కలకలం సృష్టించింది. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ పవార్‌కు 29 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే తెలిపారు. వీరింలో మొత్తం తొమ్మిది మంది NCP ఎమ్మెల్యేలు.. ఆదివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు.