ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విజృంభణను మనం చూస్తూనే ఉన్నాం. ఈ వైరస్ ప్రారంభ దశలో ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దాంతో ప్రజలంతా కొన్ని నెలల పాటు ఇళ్లకే పరిమితయ్యారు. దాంతో వచ్చిన వర్క్‌ఫ్రమ్ హోం కష్టాలు, ఎప్పుడూ గరిటె పట్టని వారి పాకశాస్త్ర ప్రతిభ, చివరగా ఔషధ సంస్థల టీకా రేసు వంటి అంశాలపై మీమ్స్ తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే జనతా కర్ఫ్యూ సందర్భంగా దీపాలు వెలిగించడంపై చేసిన మీమ్ తెగ ఆకట్టుకుంది.
- పబ్జీ ఆటను నిషేధించినప్పుడు..ఆ ఆన్‌లైన్ గేమ్ ప్రియులు చాలా బాధపడ్డారు. ఆ వెంటనే దానిపై బాలీవుడ్ నటుడు ఫాగ్-జీ పేరుతో అదే తరహా గేమ్‌ను తీసుకువస్తారనగానే నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు.
- ఇక ప్రముఖ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా కాస్త భిన్నంగానే ఉంటుంది. అదే తీరును తన కుమారుడు పేరులో చూపించగా.. నెటిజన్లు నోరెళ్లబెట్టారు. రోమన్ లెటర్స్, అంకెలతో.. ఆయనే గుర్తు పెట్టుకోలేని పేరు పెట్టి అందరిని ఆశ్చర్యపర్చారు.
- ఘనాకు చెందిన కొందరు వ్యక్తులు శవపేటికను మోస్తూ చేసిన నృత్యం, నెట్టింట్లో ఈ ఏడాది విపరీత ఆదరణను సొంతం చేసుకుంది.
- అలాగే 2020 తమ ప్రణాళికలను చెల్లాచెదురు చేయడాన్ని, లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లలో ఉండటం వల్ల కాలుష్యం తగ్గడంపైనా వచ్చిన మీమ్స్ మెప్పించాయి. అంతేకాకుండా పలు దేశాల్లో దర్శనమిచ్చిన ఏకశిలపైనా కౌంటర్లు వచ్చాయి.