మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి (Meghalaya congress) పెద్ద కుదుపు. ఆ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది బుధవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా (Mukul Sangma news) ఉండడం కూడా గమనార్హం. ఈ విషయాన్ని తృణమూల్ పార్టీ నేతలు వెల్లడించారు. తృణమూల్‌లో చేరడంపై అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లు ఉన్న అసెంబ్లీకీ 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో రాత్రికే రాత్రే తృణమూల్ ప్రధాన ప్రతిపక్షపార్టీగా అవతరించింది. దీంతో 2023లో రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో టీఎంసీ బలమైన పోటీఇచ్చే అవకాశం ఉంది.
వరుసుగా మూడోసారి బంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకుని ఈశాన్య రాష్ట్రాల్లో తన బలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి ఈ వార్త మరింత ఊత్సాహాన్ని ఇవ్వనుంది. గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై ముకుల్ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనునూయులతో కలిసి తృణమూల్‌లో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు తృణమూల్ పార్టీ (Trinamool congress) అధ్యక్షురాలు మమతా బెనర్జీ దిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మీరు కలవనున్నారా' అని విలేకరులు అడగడంతో లేదని బదులిచ్చారు. దిల్లీకి వచ్చిన ప్రతిసారీ మేము సోనియా గాంధీని కలవాల్సిన అవసరం లేదని మమత చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మమత బెనర్జీకి మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.
నేతల చేరికలతో పార్టీ విస్తరణ..