వైద్యవృత్తి అనేది అన్నింటి కన్నా గొప్పదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఒత్తిడితో కూడిన పని అని అభిప్రాయపడ్డారు. మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్న వైద్యుల సేవలు వెల కట్టలేనివని అన్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లో వైద్య విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఉన్న ఎయిమ్స్‌లో 2020-2021 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన ఆయన నూతన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
"వైద్యవృత్తి చాలా గొప్పది. ఇందులో ఒత్తిడి అదే స్థాయిలో ఉంటుంది. మీరు(విద్యార్థులు) కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. మీకు నా అభినందనలు. వైద్యవృత్తిని ఎంచుకున్న మీ ఆలోచనలు ప్రశంసించదగినవి. కరోనా కష్టకాలంలో డాక్టర్లు అందిచిన సేవలు వెలకట్టలేనివి. ప్రస్తుతం మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ముందంజలో ఉన్నారు."