Margadarsi Case Hearing in Telangana High Court: మార్గదర్శి కేసులకు సంబంధించి ఏపీ సీఐడీ అధికారులు మీడియా సమావేశాలు నిర్వహించడమేంటని.. ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు వివరాలను ఎందుకు బహిర్గతం చేస్తున్నారని ఏపీ సీఐడీని ప్రశ్నించింది. మీరే మీడియా ట్రయల్స్ నిర్వహించి శిక్ష వేసేస్తారా అంటూ ఏపీ సీఐడీని నిలదీసింది.
Margadarsi Case: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు - Margadarsi case hearing in telangana high court
Margadarsi Case in Telangana High Court: మార్గదర్శి కేసులో తెలంగాణ హైకోర్టు ఏపీ సీఐడీని ప్రశ్నించింది. సీఐడీ అధికారుల తీరును ప్రశ్నించింది. ఏపీ సీఐడి అధికారులు దర్యాప్తు సమాచారాన్ని మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు. దీన్ని సవాల్ చేస్తూ.. మార్గదర్శి ఛైర్మన్, ఎండీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.
మార్గదర్శి కేసుల విషయంలో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ తీరుపై తెలంగాణ హైకోర్టు మండిపడింది. దర్యాప్తు వివరాలను బయటకు చెప్పొద్దంటూ.. సుప్రీంకోర్టు, హైకోర్టులు పలుమార్లు చెప్పినా అలా ఎందుకు చేస్తున్నారంటూ.. విస్మయం వ్యక్తం చేసింది. ఇలా మీడియా సమావేశాలు నిర్వహిస్తుంటే దర్యాప్తుపై నమ్మకం ఎలా ఉంటుందంటూ నిలదీసింది. మార్గదర్శి కేసుల సమాచారాన్ని దర్యాప్తు అధికారులు మీడియా సమావేశం పెట్టి వెల్లడించడాన్ని సవాలు చేస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్, ఆ సంస్థ ఛైర్మన్, ఎండీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, వాసిరెడ్డి విమల్ వర్మ వాదనలు వినిపిస్తూ.. ఏప్రిల్ 12న దిల్లీలో, ఈనెల 20న హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశాలు నిర్వహించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేసుల దర్యాప్తు సమాచారం బయటికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
ఖాతాదారుల హక్కులను రక్షించడంలో భాగంగా దర్యాప్తు గురించి క్లుప్తంగా వివరాలను వెల్లడించాల్సి వస్తోందని.. ఆ మేరకు భావప్రకటనా స్వేచ్ఛ ఉందని.. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది గోవిందరెడ్డి వాదనలు వినిపించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ‘మేమూ రోజూ పత్రికలు చూస్తున్నాం. మీరేం చెబుతున్నారో తెలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి, సీఐడీకి నోటీసులిచ్చారు. ప్రతివాదిగా ఉన్న సీఐడీ చీఫ్ సంజయ్‌కు వ్యక్తిగతంగా నోటీసులు అందజేసి, రసీదులను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను వాయిదా వేశారు. గతంలో మార్గదర్శి వేసిన పిటిషన్లతోపాటు ప్రస్తుత పిటిషన్లపైనా జులై 20న విచారణ చేపడతామన్నారు. ఈ పిటిషన్‌లలో ఇప్పటికే జారీ అయిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నామన్నారు.