మన సైనిక బాహుబలి..
1962 చైనా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా భారత్ అంటే ఓ చులకన భావం ఏర్పడింది. దీన్ని మార్చి.. భారత్ అజేయ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు 'ఫీల్డ్ మార్షల్' శామ్ మానెక్షా. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో సైన్యాధ్యక్షుడిగా భారత సేనలను ముందుండి నడిపించి, దాదాపు 90వేలకు పైగా శత్రు సైనికులు భారత్ ముందు మోకరిల్లేలా చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో ఐదు యుద్ధాలు చూసిన మానెక్షా.. భారత సైన్యాన్ని శత్రు భయంకరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. సైన్యంలో రాజకీయనేతల జోక్యానికి కూడా ఆదిలోనే గండికొట్టిన ఘనత మానెక్షాదే!
హక్కుల 'వినియోగ' దారి
వినియోగదారుల హక్కులపై దేశంలో అంతగా అవగాహన, చైతన్యం లేని కాలంలో వాటి కోసం నినదించి, పోరాడిన వ్యక్తి హెచ్.డి. శౌరి. 69 ఏళ్ల వయసులో సాధారణంగా చాలా మంది రామా హరీ అంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆ వయసులో శౌరి... దేశంలో వినియోగదారుల ఉద్యమానికి ఊపిరిలూదారు. 80ల్లో శౌరి పేరు వింటే.. బడా సంస్థలకు హడల్. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలనేవి ఒకటున్నాయని తెలియని రోజుల్లో వాటితో న్యాయస్థానాల తలుపులను తడుతూ వినియోగదారుల హక్కుల కోసం దాదాపు 70కు పైగా దావాలు వేసి.. చాలా వాటిలో విజయం సాధించారు. ఆయన కృషి పలితంగానే జిల్లా స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఏర్పడ్డాయి. అలా వినియోగదారుల ఉద్యమానికి పాటుపడుతూనే 2005లో 93 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
ఆయనే కలపకుంటే...?
విభజన సమయంలో బ్రిటిషర్లు ఎన్నో కుయుక్తులకు పాల్పడ్డారు. అందులో భాగంగానే దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు. ఏ దేశంలో కలవాలో నిర్ణయించుకొనే అధికారం వాటికే కట్టబెట్టారు. దీంతో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం పెద్ద సమస్యగా మారింది. ఈ కఠినతర బాధ్యతను ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు భారత్ నాయకులు అప్పగించారు. "దేశంలో చాలా రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే నీవల్లే అవుతుంది" అని మహాత్మాగాంధీ.. పటేల్‌పై నమ్మకం ఉంచారు. కశ్మీర్ తప్పించి మిగిలిన వాటి బాధ్యత ఆయనపై పెట్టారు. ఆ నమ్మకాన్ని పటేల్ వమ్ము చేయలేదు. దాదాపు 565కు పైగా సంస్థానాలను భారత్‌లో చేర్చారు. ప్రాణం పోయినా, భారత్‌లో కలిసేది లేదని భీష్మించుకు కూర్చున్న సంస్థానధీశులను తన చాతుర్యంతో ఒప్పించారు. అదే సమయంలో మాటలతో దారికి రాని హైదరాబాద్ లాంటి సంస్థానాలను చేతలతో (సైనిక చర్యలు) దారికి తెచ్చారు.
రాజ్యాంగ రూపశిల్పి
వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలతో ఎంతో వైవిధ్యత కలిగిన భారతదేశం నేడు ఓ అఖండ శక్తిగా, ప్రపంచ ప్రజాసామ్యానికి దిక్సూచిగా వెలుగుతోందంటే అందుకు కారణం భారత రాజ్యాంగం. దాని రూపశిల్పి బి.ఆర్. అంబేడ్కర్. ఒక సామూహిక శక్తిగా భారతదేశం ఎదగడానికి, అసమానతలు, అంతరాలు లేని సమసమాజ స్థాపనకు ఆయన రాజ్యాంగంలో పునాదులు వేశారు. ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలూ ఉంటాయని నేర్పిన వ్యక్తి. షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు రిజర్వేషన్లు కల్పించి స్వాతంత్ర భారతంలో బడుగు, బలహీన వర్గాలకు భరోసా ఇచ్చిన నాయకుడు.
భాషలకు పెద్ద పీట
సర్దార్ వల్లభాయ్ పటేల్ వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసి భారత భౌగోళిక సరిహద్దులను నిర్ణయిస్తే, ఆ భౌగోళిక స్వరూపంలో తిరిగి మార్పులు చేసింది తెలుగు తేజం పొట్టి శ్రీరాములే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ హయాం నాటి పరిపాలనా హద్దులను మార్చి, భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచాలని అప్పటి ప్రధాని నెహ్రూకు చాలా మంది సూచించారు. నెహ్రూ అంతగా మొగ్గు చూపలేదు. అలా చేస్తే దేశంలో హింస చెలరేగుతుందని భయపడ్డారు. కానీ ఆంధ్రరాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన 56 రోజుల ఆమరణ నిరాహారదీక్షతో నెహ్రూ తలవంచక తప్పలేదు.
అణువంత... ధీమా!
ఈ రోజు భారత్ అణ్వస్త్ర దేశంగా అవతరించిందన్నా, ఆ పరిజ్ఞానంలో ప్రపంచదేశాలతో పోటీపడుతుందన్నా అందుకు కారణం.. హోమీ జహంగీర్ బాబా వేసిన పునాదులే. భారత్ అణు కార్యక్రమాన్ని ఆయన పరుగులు పెట్టించారు. చాలా దేశాలు అణుశక్తి ప్రయోజనాలను ఊహించని కాలంలోనే ఆయన ఆ శక్తి ప్రాముఖ్యాన్ని గుర్తించారు. తదనంతర కాలంలో భారత్ పోఖ్రాన్ లాంటి అణు ప్రయోగాలను దిగ్విజయంగా చేపట్టిందంటే అది ఈ అణ్వస్త్ర పితామహుడి చలవే.