మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలోని మహద్ తలై గ్రామంలో కొండచరియలు విరిగి పడ్డ ఘటనలో 36 మంది మృతిచెందారు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు.
కుండపోత వానలతో..
మహారాష్ట్రలో కొద్దిరోజులుగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఎక్కడికక్కడ వరదలు పోటెత్తగా... మహద్ తలై గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. దాదాపు 300 మంది చిక్కుకుని ఉంటారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోగా... సహాయక చర్యలు చేపట్టడం ఆలస్యమైంది.
ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డును అధికారులు రంగంలోకి దింపారు. ఆయా దళాల సిబ్బంది... ఇప్పటికే కొందరిని కాపాడారు. 36 మంది మరణించారని ధ్రువీకరించారు. మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే... భారీగా వరద ప్రవాహం ఉండటం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలగొచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
మోదీ సంతాపం
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.