Manish sisodia: హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేందుకు భాజపా సిద్ధమవుతోందంటూ ఆమ్ ఆద్మీ పేర్కొంది. ప్రస్తుతం సీఎం జైరాం ఠాకుర్ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకుర్‌ను నియమించేందుకు పరిశీలన చేస్తోందని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పెరుగుతోన్న ఆదరణ చూసి.. ఓటమి తప్పదని భాజపా భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందే హిమాచల్‌లో సీఎంను మార్చేందుకు భాజపా సన్నాహాలు చేస్తోందని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు.
'దిల్లీ పాలనా మోడల్‌తోపాటు అరవింద్ కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి భాజపా భయపడుతోంది. అందుకే హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి స్థానంలో అనురాగ్ ఠాకుర్‌ను నియమించాలని చూస్తోంది. ఈ విషయంపై మాకు విశ్వసనీయ సమాచారం ఉంది' అని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. జైరాం ఠాకుర్ పాలనతో తీవ్ర అసంతృప్తితో ఉన్న హిమాచల్ ప్రజలు.. వచ్చే అసెంబ్లీలో ఆమ్ ఆద్మీకి పట్టం కట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు నాయకులను మార్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను భాజపా కప్పిపుచ్చుకోలేదన్నారు. వారు ఏం చేసినా కూడా వచ్చే ఎన్నికల్లో హిమాచల్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు మనీశ్ సిసోడియా జోస్యం చెప్పారు.