Manipur Firing Today :మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్‌పోక్పై జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గిరిజనుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న.. ఇరెంగ్, కరమ్ వైపేయి గ్రామాల మధ్య ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఖండించిన గిరిజన ఐక్యత సొసైటీ..
మరోవైపు.. ఈ ఘటనను గిరిజన ఐక్యత సొసైటీ తీవ్రంగా ఖండించింది. మణిపుర్‌లోశాంతిని పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్రిక్తతలు ఉన్న జిల్లాలన్నింటినీ వివాదాస్పద ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కోరింది.
సెప్టెంబరు 8న తెగ్నోవుపల్ జిల్లాలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రోజు(మంగళవారం) జరిగిన ఘటనపై గిరిజన ఐక్యత సొసైటీ ఆందోళన వ్యక్తం చేసింది.
భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య ఎన్కౌంటర్..
Manipur Violence News : అంతకుముందు.. గత నెల(ఆగస్టు) 31వ తేదీన మణిపుర్లోభద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బిష్ణుపుర్ జిల్లాలోని తమనాపోక్పి వద్ద జరిగిన ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 8 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు కుకీ ఉగ్రవాదులు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. గాయపడిన వారిలో ఇద్దరు భద్రతా బలగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిపింది.