Manipur CM Biren Singh resign : మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేస్తారన్న ఊహాగానాల నడుమ ఇంఫాల్‌లో హైడ్రామా నెలకొంది. నగరంలోని సీఎం అధికారిక నివాసం దగ్గర శుక్రవారం వేల మంది అభిమానులు ప్రదర్శన చేపట్టారు. సీఎం పదవికి బీరేన్ సింగ్ ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయరాదని నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయబోరని ఆయన్ను కలిసిన మహిళా నేతలు కొందరు బీరేన్ సింగ్ ఇంటి దగ్గర నిరసన చేస్తున్నవారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. అప్పటికే సీఎం రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఆయన మద్దతుదారులు ఆయనపై ఒత్తిడి తెచ్చి, దానిని చింపేశాలా చేశారని సమాచారం.
ఈ హైడ్రామా నడుమ.. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన ఇంటి నుంచి బయలుదేరి రాజ్‌భవన్‌కు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. మణిపుర్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. కాసేపటికే ఈ విషయంపై స్పష్టత ఇస్తూ ట్వీట్ చేశారు బీరేన్ సింగ్. ఇలాంటి క్లిష్ట సమయంలో తాను రాజీనామా చేయడం లేదని తేల్చిచెప్పారు.
తన రాజీనామాపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చే ముందు ఆయన కాన్వాయ్ రాజ్‌భవన్ పైపుగా వెళ్లడాన్ని గమనించిన అభిమానులు.. వేల సంఖ్యలో వచ్చి దాన్ని అడ్డుకున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం. చివరకు తాను రాజీనామా చేయట్లేదని మహిళకు వివరణ ఇచ్చారు బీరెన్ సింగ్. ముఖ్యమంత్రి రాజీనామా చేయట్లేదని నిర్ధరించుకున్న అభిమానులు.. అక్కడి నుంచి నెమ్మదిగా వెనుదిరిగారు. సీఎం రాజీనామా చేయకూడదని, ఆయన తమ కోసం చాలా చేస్తున్నారని.. తమ మద్దతు బీరేన్ సింగ్‌కు ఉంటుందని అక్కడి మహిళలు చెబుతున్నారు.
దీనికి ముందు వందల మంది యువత నల్ల చొక్కాలు ధరించి.. శుక్రవారం మధ్యాహ్నం సీఎం ఇంటి ముందు బైఠాయించారు. వారితో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ క్లిష్ట సమయంలో బీరేన్ సింగ్ ప్రభుత్వం దృఢంగా నిలబడాలని, సమస్యలు సృష్టించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని.. మహిళా నాయకురాలు ఒకరు అన్నారు.
కాగా గురువారం కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా బలగాలు, అల్లరి మూకలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారి సంఖ్య మూడుకు పెరిగిందని.. మరి కొంత మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.అల్లర్లలో చనిపోయిన ఇద్దరి మృతదేహాలతో సంబంధిత సంఘాలు.. సీఎం నివాసం వైపు ఊరేగింపుగా వచ్చాయని వారు వెల్లడించారు. వారందరిని పోలీసులు అడ్డగించారని పెర్కోన్నారు. దీంతో అక్కడ కుడా హింసాత్మక ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని వివరించారు.