మణిపుర్లో అసోం రైఫల్స్పై జరిగిన ఉగ్రదాడిని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఘటన జరిగిన చురాచంద్‌పుర్ ప్రాంతంలో భారీ కుంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఘటనకు పాల్పడిన వారు ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదనే లక్ష్యంతో పారామిలిటరీ దళాలు, కమాండోలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అటు ఉగ్రవాదులు.. సరిహద్దుల్లోని మయన్మార్‌కు పారిపోకుండా ఉండేందుకు.. అక్కడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ వివరాలను మణిపుర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. ఉగ్రదాడిలో గాయపడి.. ఇంపాల్లోని షిజియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ జవానును ఆయన పరామర్శించారు. జవానుకు మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను, ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.
జవాన్లపై ఉగ్రవాదుల హింసాకాండకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు వివరించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ జరిగింది..
మణిపుర్‌లోని చురాచంద్‌పుర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై శనివారం మధ్యాహ్నం ఉగ్రవాదులు భీకర దాడి జరిపారు. ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన భార్య, ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. అసోం రైఫిల్స్‌కు చెందిన మరో నలుగురు సిబ్బంది సైతం చనిపోయారని పేర్కొంది. నలుగురు జవాన్లు గాయపడ్డారని వివరించింది.