ఖరీదైన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌కు క్యాన్లు కట్టుకుని, ఇంటింటికీ తిరిగి పాలు పోస్తున్న ఓ వ్యక్తి.. రాత్రికి రాత్రే నెట్టింట ఫేమస్ అయ్యాడు. హరియాణా ఫరీదాబాద్ జిల్లా మొహబ్బతాబాద్ గ్రామానికి చెందిన అమిత్ భదానా అనే వ్యక్తి ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగి. కొంతకాలం క్రితం ఉద్యోగం మానేసి కుటుంబ వ్యాపారంలోకి దిగాడు. లక్షల రూపాయలు విలువైన బైక్ కొన్నాడు. ఆ బైక్ మీదే ఇంటింటికీ తిరుగుతూ పాలు పోస్తున్నాడు. ఇలా పాలు అమ్ముతున్న వీడియో సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది.
అమిత్ భదానా గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు. ఆ తర్వాత బ్యాంక్‌లో పని చేయడం ప్రారంభించాడు. ఒకే చోట కూర్చొని పనిచేయడం ఇష్టం లేక బ్యాంక్ ఉద్యోగం మానేశాడు. అమిత్ భదానాకు చిన్నప్పటి నుంచి బైక్‌లంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను కొన్నాడు. అప్పటి నుంచి ఆ బైక్‌పై పాలు అమ్మడం ప్రారంభించాడు. అలా తనకిష్టమైన బైక్‌పై.. తనకు నచ్చిన పాల వ్యాపారం చేస్తున్నాడు. హార్లీ డేవిడ్‌సన్ బైక్ ధర 5 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇంత ఖరీదైన బైక్‌పై పాలు అమ్మడం ఏంటని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు.