Man marries 14 women: గత 48 ఏళ్లలో ఏడు రాష్ట్రాలకు చెందిన 14 మంది మహిళల్ని పెళ్లి పేరుతో మోసగించిన వృద్ధుడిని ఒడిశా భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 11 ఏటీఎం కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు, మరికొన్ని కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
48 ఏళ్లుగా..
ఒడిశా కేంద్రపరా జిల్లా పట్కురా ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడి వయసు ప్రస్తుతం 60ఏళ్లపైనే. అతడికి 1982లో తొలిసారి వివాహం అయింది. 2002లో రెండో పెళ్లి చేసుకున్నాడు. తొలి రెండు వివాహాలతో అతడికి ఐదుగురు పిల్లలు పుట్టారు. మొదటి భార్యలు ఇద్దరూ ఒడిశా వారే.
2002 నుంచి 2020 వరకు అతడు నిత్యపెళ్లికొడుకుగా చెలరేగిపోయాడు. మధ్యవయసులో ఉన్న ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకుని భాగస్వామి కోసం చూస్తున్న మహిళలే అతడి టార్గెట్. మాట్రిమోని వెబ్సైట్ల ద్వారా అలాంటి వారికి వల వేసేవాడు. తాను వైద్యుడినని చెప్పుకునేవాడు. న్యాయవాదులు, వైద్యులు, బాగా చదువుకున్న ఒంటరి మహిళలకు ఎరవేసేవాడు. పెళ్లి అయ్యాక వారి దగ్గర డబ్బులు తీసుకుని మాయం అయ్యేవాడు. ఇలా దిల్లీ, పంజాబ్, అసోం, ఝార్ఖండ్, ఒడిశాకు చెందిన వారిని మోసగించాడు ఆ వ్యక్తి. పారా మిలటరీలో పనిచేసే ఓ మహిళ కూడా ఇతడి బాధితురాలేనని తెలిసింది.
ఆఖరి భార్య ఫిర్యాదుతో..
2018లో దిల్లీలో 14వ పెళ్లి చేసుకుని.. భార్యను భువనేశ్వర్ తీసుకొచ్చాడు ఆ వ్యక్తి. స్కూల్ టీచర్‌గా చేస్తున్న ఆమెకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. 14వ భార్య.. భువనేశ్వర్‌లోని మహిళా పోలీస్ స్టేషన్లో గతేడాది జులైలో ఇదే విషయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలో హైదరాబాద్, ఎర్నాకులంలో నిరుద్యోగ యువతను మోసగించడం, లోన్ ఫ్రాడ్ కేసుల్లో అతడు రెండుసార్లు అరెస్టు అయినట్లు పోలీసులు తెలిపారు.
అయితే.. 14 మందిని పెళ్లాడి, మోసగించాడన్న ఆరోపణల్ని నిందితుడు తోసిపుచ్చాడు.