భార్య, నాలుగేళ్ల కూతురిని గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉన్నావ్‌లో ఆదివారం రాత్రి జరిగిందీ దారుణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతులను మోహన్, సీమ, వారి నాలుగేళ్ల కూతురుగా పోలీసులు గుర్తించారు. వీరంతా భగవంత్ నగర్ ప్రాంతంలోని నరేంద్రపుర్ గ్రామస్థులు. రాత్రి నిద్రపోయే సమయంలో మోహన్, అతని భార్య సీమకు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశంలో మోహన్ భార్య సీమను గొడ్డలితో నరికాడు. అనంతరం తన నాలుగేళ్ల కూతురి పైనా వేటు వేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత మోహన్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
'నేను ఆదివారం వేరే ఊరికి వెళ్లాను. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాను. అప్పుడు ఇంటి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లా. ఒక్కసారికి షాక్‌కు గురయ్యా. నా కోడలు, మనవరాలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నా కుమారుడు కూడా విగతజీవిగా కనిపించాడు.' అని మృతుడు మోహన్ తండ్రి శ్యామపాల్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.