Man Gets 3 Years Jail For Calling Minor Hot :బాలికను 'హాట్' అంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ 50 ఏళ్ల వ్యక్తికి మహారాష్ట్ర ముంబయిలోని ప్రత్యేక పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. భారతీయ శిక్షస్మృతిలోని పలు సెక్షన్ల కింద అతడిని దోషిగా నిర్ధరిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి ఎస్సీ జాదవ్ డిసెంబర్ 14న తీర్పు వెలువరించారు. దీనికి సంబంధించిన వివరణాత్మక ఆర్డర్ శనివారం అందుబాటులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందంటే?
2016 మే 24న 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఓ మసీదు వద్ద నిల్చుని ఉంది. ఇంతలో నిందితుడు ఆమె వద్దకు వెళ్లి అనుచితంగా తాకాడు. అంతటితో ఆగకుండా ఆమె చాలా 'హాట్'గా ఉందని, బుగ్గలపై ముద్దు పెట్టుకోవాలని ఉందని అన్నాడు. ఆమెను తనతో తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు అసభ్యంగా మాట్లాడాడు.
బాధితురాలి కుటుంబసభ్యుల ద్వారా ఫిర్యాదు అందుతున్న పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడాలనే ఉద్దేశంతో ఆమెను తాకడం, అసభ్యంగా మాట్లాడటం చేశాడని తెలిపింది. దీంతోపాటు నిందితుడు బాలికను వెంబడించి లైంగికంగా వేధించేవాడని రుజువైందని కోర్టు పేర్కొంది.
నిందితుడికి ఐదేళ్ల శిక్ష రద్దు చేసిన కోర్టు!
ఓ నిందితుడికి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్ రద్దు చేసింది. అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో బాధితుల వాంగ్మూలంలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జరిగింది.